కడప జిల్లా అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి అడ్డా అనే విషయం తెలిసిందే. దివంగత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్న దగ్గర నుంచి, ఆ జిల్లాలో టీడీపీకి గెలుపు చాలా కష్టమవుతూ వచ్చింది. ఏదో ఒకటో రెండో సీట్లు గెలవడం తప్ప, కడప జిల్లాలో టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. ఇక వైఎస్సార్ చనిపోవడం,  రాష్ట్రంలో కాంగ్రెస్ మరుగైపోయినా, వైఎస్ తనయుడు జగన్ రూపంలో టీడీపీకి కష్టకాలం కొనసాగుతూనే ఉంది.

 

2014లో రాష్ట్రమంతా టీడీపీ గాలి ఉన్నా సరే కడపలో మాత్రం వైఎస్సార్‌సీపీ హవానే నడిచింది. జిల్లాలో ఉన్న 10 సీట్లలో 9 వైఎస్సార్‌సీపీనే గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో అయితే మొత్తం సీట్లు వైఎస్సార్‌సీపీకే దక్కాయి. అయితే పైగా రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో కడప జిల్లాలో టీడీపీ అడ్రెస్ గల్లంతైంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంకా ఎప్పటికీ గెలవదనే పరిస్తితి వచ్చేసింది.

 

అసలు టీడీపీ ఆవిర్భావించక ప్రొద్దుటూరులో ఆ పార్టీ ఒక్కసారే గెలిచింది. 2009లో మల్లెల లింగారెడ్డి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వరదరాజులు రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలుస్తున్నారు. అయితే శివప్రసాద్ బలంగా పాతుకుపోవడంతో ప్రొద్దుటూరులో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు.

 

ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలని చేస్తున్నారు. కాకపోతే ఈ ఏడాదిలో మాత్రం ప్రొద్దుటూరులో పెద్ద మార్పు ఏమి రాలేదు. అయినా సరే వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటం వల్ల, టీడీపీ వీక్ గా ఉంది.

 

అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన మల్లెల లింగారెడ్డి పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించడంతో లింగారెడ్డి సైలెంట్ అయిపోయారు. ప్రవీణ్‌కు నియోజకవర్గంపై పెద్దగా పట్టు దక్కలేదు. ఇదే సమయంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వరదరాజులు రెడ్డి వైఎస్సార్‌సీపీ వైపు రావడం, ఎమ్మెల్యే రాచమల్లుకు బాగా ప్లస్ అవుతుంది. మొత్తానికైతే భవిష్యత్‌లో ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం చాలా కష్టమని అర్ధమైపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: