కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అంటూ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పి చేసిన అంచనాలు భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్ పై అనేక సందేహాలను కలిగిస్తున్నాయి. గతంలో వేసిన అంచనాలకంటే కరోనా ప్రభావం ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ పై చాల ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ లకు సంబంధించిన నిరర్ధక ఆస్థుల నిష్పత్తి 14 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదు అంటూ ఈ నివేదిక పేర్కొంది.


కరోనా తో ఆర్ధిక వ్యవస్థ మందగించడంతో బ్యాంక్ రుణాలకు సంబంధించిన ఈఎంఐ లపై మారటోరియం 6 నెలలు విధించడంతో పాటు అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రస్తుత పరిస్థితులలో కోలుకోలేని స్థితిలో దెబ్బ తినడంతో బ్యాంక్ లు ఇచ్చిన రుణాలు వసూలు కావడం అంత సులువైన పనికాదు అని ఈ నివేదిక అభిప్రాయం. దీనికితోడు బ్యాంక్ ల రుణాల వసూళ్లు కూడ పూర్తిగా నిలిచి పోవడంతో మొండిబకాయిల స్థాయి మరింత పెరిగిపోవడంతో ఈ పరిస్థితులలో ప్రభుత్వరంగ బ్యాంక్ లను ప్రభుత్వాలు రక్షించాలి అంటే వాటికి 40 వేల కోట్ల వరకు మూలధన సహాయం అవసరం అవుతుందని ఈ నివేదిక అభిప్రాయ పడుతోంది.


ముఖ్యంగా స్థిరాస్తి టెలికాం విద్యుత్ రంగాలలో బ్యాంక్ లు ఇచ్చిన రుణాలు వేల కొట్లల్లో ఉన్న పరిస్థితులలో బ్యాంక్ ల నిరర్ధక ఆస్థుల విలువ మరింత పెరిగిపోతుందని ఈ నివేదిక హెచ్చరికలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తగా పరిశ్రమలు వ్యాపారాలు పెట్టే వారికి బ్యాంక్ లు రుణాలు ఇవ్వడం పూర్తిగా తగ్గించి వేస్తాయని ఈ పరిస్థితులలో కొత్త పరిశ్రమలు వ్యాపారాలు ప్రారంభించడం జరగక పోతే ఉద్యోగ కల్పన సాధ్యం కాదని ఈ నివేదిక అభిప్రాయం. భారత ఆర్ధిక వ్యవస్థకు గుండెకాయ లాంటి బ్యాంక్ లకు సమస్యలు ఏర్పడితే దీని ప్రభావం భారత ఆర్ధిక వ్యవస్థను మరింత అతలాకుతలం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: