82 వసంతాల సినిమా బొమ్మ - సాధించింది ఏంటీ?Embeded Image
తెలుగు సినిమా బొమ్మ పురుడుపోసుకుని 82 ఏళ్లవుతోంది. తెలుగు తొలి సినిమా 'భక్త ప్రహ్లాద' విడుదలై నేటికి 81 ఏళ్లు పూర్తి చేసుకుని 82వ వసంతంలోకి అడుగుపెట్టింది. హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తొలి తెలుగు టాకీ మూవీ 81 ఏళ్ల క్రితం 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. ఇంతకాలం ఈ సినిమా విడుదల విషయంలో కాస్త గందరగోళం ఉండేది. అయితే భారతీయ తొలి టాకీ 'ఆలంఆరా' విడుదలైన ఆరు నెలలకు అంటే 1931 సెప్టెంబర్ 15న 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైన మాట నిజం కాదనీ, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలైందని ఆధారాలతో సహా సీనియర్ జర్నలిస్టు రెంటాల జయదేవ ఆధారాలతో సహా తెలపడంతో విడుదల విషయం తేటతెల్లం అయింది. పద్దెనిమిది వేల రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది రోజుల్లో 'భక్త ప్రహ్లాద' నిర్మాణం పూర్తి చేశారు. 9,762 అడుగుల నిడివిగల పది రీళ్ల ఈ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. ఈ సినిమాను మొదట బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో ఫిబ్రవరి 6న విడుదల చేశారు. బొంబాయిలో రెండు వారాలు ఆడిన తర్వాత విజయవాడలోని శ్రీ మారుతి సినిమా హాల్ లో, రాజమండ్రిలోని శ్రీకృష్ణా సినిమాహాల్లో విడుదలైంది. తొలి దశాబ్దం తెలుగు చలన చిత్ర పరిశ్రమ తొలి అడుగు వేసింది 1931-1940 దశకంలోనే. ఈ తొలి దశాబ్దంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా భక్త ప్రహ్లాదతో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించారు. ఈ కాలంలో ప్రతిభను కనపరచిన దర్శకులలో 'లవకుశ'తో సి.పుల్లయ్య, 'సీతా కళ్యాణం'తో సిహెచ్.నరసింహారావు, 'శ్రీవెంకటేశ్వర మహాత్యం'తో పి.పుల్లయ్య, 'మార్కండేయ'తో సిహెచ్.నారాయణ, 'కనకధార'తో హెచ్.వి.బాబు తదితరులు ఉన్నారు. తొలి దశాబ్దంలో సాంఘీక చిత్రాలు కూడా మొదలయ్యాయి. 1936లో కృత్తివెన్ను సోదరులు నిర్మించిన 'ప్రేమ విజయం' తెలుగులో మొదటి సాంఘిక చిత్రం. ఇది అంతగా ఆడలేదు. ఆ తరువాత హెచ్ఎమ్ రెడ్డి నిర్మించిన గృహలక్ష్మి సినిమాతో చిత్తూరు నాగయ్య సినీరంగంలో ప్రవేశించాడు. 1939లో బిఎన్ రెడ్డి, కె.రామనాధ్, ఎకె శేఖర్‌లు కలిసి వాహినీ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. వందేమాతరం వాహిని వారి తొలి సినిమా. తరువాత వరవిక్రయం సినిమాలో భానుమతి సినీ ప్రస్థానం ఆరంభమైంది. 1938-1939 సంవత్సరాల్లో తెలుగు సినిమాకు కొత్త రూపురేఖలు వచ్చాయి. సినిమా వినోదం సృష్టించడం మాత్రమే కాదు.. విప్లవం కూడా సృష్టించగలదని నిరూపించారు. కేవలం పురాణ గాధలే సినిమాలుగా వస్తూ ప్రజానీకాన్ని ఆనందపరుస్తున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం 'మాలపిల్ల' లాంటి చిత్రం తీసి, విప్లవం సృష్టించాడు. ఆ వరసలో ఆ రెండేళ్ళలోనూ 1938లో రోహిణి, హెచ్.ఎం.రెడ్డి, నాగయ్య, కన్నాంబ కాంబినేషన్ లో గృహలక్ష్మి, 1939లో వాహిని పతాకంపై బి.ఎన్.రెడ్డి, నాగయ్య, కాంచనమాల కాంబినేషన్ లో వందేమాతరం, 1939లో వై వి.రావు, కాంచనమాల కాంబినేషన్ లో 'మళ్ళీ పెళ్ళి', 1939లో సారధి, గూడవల్లి రామబ్రహ్మం, సూరిబాబు, టంగుటూరి సూర్యకుమారి కాంబినేషన్ లో రైతుబిడ్డ, 1939లో కాళ్ళకూడి నారాయణరావు, భానుమతి కాంబినేషన్ లో వరవిక్రయం వంటి సమస్యాత్మక విషయాలపై చిత్రాలు విడుదలై తెలుగు సినిమాని పై స్థాయిలో నిలబెట్టాయి. స్వర్ణయుగం తర్వాత.. అప్పటి నుంచి మొదలైన మన తెలుగు సినిమా క్రమక్రమంగా ఓ భారీ పరిశ్రమగా రూపాంతరం చెందింది. 1980 వరకూ ఉన్న కాలాన్ని తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగంగా చెబుతుంటారు. ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు, నటీనటులు తెరపైకి వచ్చారు. 1990 నుంచీ కొద్ది కొద్దిగా తెలుగు సినిమా పరిశ్రమలో మార్పు వచ్చింది. పరభాష నటులేగాక, టెక్నీషియన్లు, హీరోయిన్లు, దర్శకులు రావటం మొదలైంది. లోకల్‌ టాలెంట్‌ దొరకటం లేదనే కారణంతో పరభాషా నిపుణులను తీసుకురావటం ఎక్కువైంది. అప్పట్లో సినిమాకు కథ చాలా ప్రధానమైన విషయం. అందుకు తగ్గట్టు ఇక్కడి నటులను తీసుకునేవారు. ఈ రోజుల్లో మాత్రం కంటెంట్‌ కన్నా కామర్స్‌ ప్రధానంగా నడుస్తోంది. 82 ఏళ్లలో దాదాపు ఆరు వేలపై చిలుకు సినిమాలు విడుదలైనట్టు ఓ అంచనా. రోజులు కాదు కలెక్షన్లు.. సినిమాల సంఖ్య ఎంత పెరిగిందో, సక్సెస్‌ రేట్ కూడా అదే విధంగా పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే.. సక్సెస్ రేటు పది శాతం కూడా లేదు. పరిశ్రమకు అప్పట్లో ఉన్నంత లాభాలు లేవు. కొన్నేళ్ల క్రితం వరకు 'మా సినిమా శత దినోత్సవం జరుపుకుంది', 'మా సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది', 'మా సినిమా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది' అని ఆ సినిమాకి సంబంధించిన వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఆ రోజులు గతించిపోయాయి. గోల్డెన్ జూబ్లీ (365 రోజులు), సిల్వర్ జూబ్లీ (25 వారాలు - 175 రోజులు) అనే మాటల సంగతి అటుంచి శత దినోత్సవం అనే మాట కూడా అరుదైపోయింది. ఇప్పుడు 'మా సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది', 'మా సినిమా 40 కోట్లు వసూలు చేసింది', 'మా సినిమా 50 కోట్లు వసూలు చేసింది' అని చెప్పుకోడానికే అందరూ ఇష్టపడుతున్నారు. అంటే సినిమా విజయానికి ఎన్ని రోజులు ఆడింది అనే కొలమానం పోయి, ఎన్ని కోట్లు వసూలు చేసిందనేది కొలమానంగా మారిపోయింది. అతి వేగంగా మారుతున్న కాలమాన పరిస్థితుల్లో, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రకరకాల వినోద సాధనాల మధ్య ఇవాళ ఒక సినిమా ఎక్కువ కాలం థియేటర్‌లో నడవడమనేది గగనం. ఎగ్జాంపుల్ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయం సాధించిన పవన్ కల్యాణ్ చిత్రం 'గబ్బర్‌సింగ్' సైతం 65 కేంద్రాల్లోనే (నిర్మాత ప్రకారం) వంద రోజులు ఆడింది. పెద్ద హీరోల సినిమాలు సైతం వంద రోజుల ఆడేంత సీన్ లేకపోడానికి ఇందుకు కారణం పైపై షోకులపై పెడుతున్న దృష్టి కథపై పెట్టకపోవడమే. ఒకరిని చూసి ఒకరు భారీ బడ్జెట్ అంటూ వెంపర్లాడుతుండటమే. అంతేకాదు ఇతర భాష చిత్రాలు నేషనల్, ఇంటర్నేషన్ లో పలు అవార్డులు అందుకుంటున్నాయి. శాండిల్ వుడ్ వంటి మన కంటే చాలా చిన్న పరిశ్రమలు పలు నేషనల్ అవార్డులు అందుకుంటుంటే మన సినిమాలకు అంతా సినిమా లేదని సీన్ చూస్తుంటే అర్థం అవుతోంది. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ముందుగా దర్శక నిర్మాతలు మారాలి. అప్పుడే మన తెలుగు తెరపై మరో స్వర్ణయుగం కనిపిస్తుంది. తెలుగు సినిమా ప్రభంజనంలో తొలి మైలురాళ్ళు : తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931) తొలి జానపద చిత్రం చింతామణి (1933) తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936) తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937) తొలి సోషియో-ఫాంటసీ తెలుగు చిత్రం దేవాంతకుడు (1960) తొలి రంగుల చిత్రం లవకుశ (1963) తెలుగు నుంచి ఇతర భాషలోకి అనువదింపబడిన (డబ్బింగ్) తొలి చిత్రం కీలు గుర్రం (1949) తమిళంలో మాయ కుదిరై పేరుతో 4 ఆగస్టు, 1949న విడుదలైంది. తొలి తెలుగు అనువాద చిత్రం ఆహుతి (1950) (హిందీ చిత్రమైన నీల్ ఔర్ నందా నుండి) అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం పాతాళ భైరవి (1951) విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం మల్లీశ్వరి (1951) జాతీయ స్థాయిలో ద్వితియ ఉత్తమ చిత్రంగా నిలచిన తొలి తెలుగు చిత్రం నర్తనశాల (1963) తొలి అపరాధ పరిశోధక తెలుగు చిత్రం దొరికితే దొంగలు (1965) తొలి A సర్టిఫికెట్ చిత్రం మనుషులు మమతలు (1965) తొలి తెలుగు జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 (1966) తొలిసారిగా సినిమా సూత్రాలను అనుకరించకుండా (ఆఫ్ బీట్) తీసిన తెలుగు చిత్రం సుడిగుండాలు (1967) తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు (1973) వినోదపు పన్ను మినహాయింపు పొందిన తొలి చిత్రం తీర్పు (1975) జాతీయ స్థాయిలో ద్వితియ ఉత్తమ చిత్రంగా నిలచిన రెండవ తెలుగు చిత్రం శంకరాభరణం (1980) తొలి 3డి చిత్రం జై బేతాళ (1985) తొలి 70 ఎంఎం చిత్రం సింహాసనం (1986) 40-ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం పెదరాయుడు (1995) 50- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం ప్రేమించుకుందాం.. రా! (1997) 60- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం చూడాలనివుంది (1998) 70- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం సమరసింహారెడ్డి (1999) 75 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం కలిసుందాం.. రా! (2000) 100- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం నరసింహనాయుడు (2001) 125- కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం సింహాద్రి (2003) (150 కేంద్రాలలో) 192- కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం ఠాగూర్‌ (2003) 200-ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం పోకిరి(2006) 223-ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం మగధీర(2009)
Rate This Article :
Rating : 0/5 (0 Votes)