రేపు విడుదల కాబోతున్న ‘బ్రూస్ లీ’ ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆశక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్. దాదాపు 8 సంవత్సరాల తరువాత తన తండ్రి చిరంజీవి మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్ కు వస్తూ ఉంటే తన తల్లి భావోద్వేగానికిలోనై ఆమె కళ్ళు చెమర్చాయి అన్న విషయాన్ని బయట పెట్టాడు రామ్ చరణ్.
‘బ్రూస్ లీ’ సినిమా కోసం చిరంజీవి లుక్ తో పాటు కాస్ట్యూమ్స్ ను కూడ తానే డిజైన్ చేసాను అని చెపుతూ మొట్టమొదటిగా తన తండ్రి చిరంజీవి క్లీన్ షేవ్ చేసుకుని అందంగా కనిపిస్తాను అంటే తనకు తన తండ్రి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా గుర్తుకు వచ్చి ‘బ్రూస్ లీ’ లోని తన తండ్రి పాత్ర కోసం చిన్న గడ్డం పెంచమని తానే సలహా ఇచ్చాను అంటూ చిరంజీవి ‘బ్రూస్ లీ’ లుక్ సీక్రెట్ విప్పాడు రామ్ చరణ్.
ఇదేసినిమాలో తాను ‘మగధీర’ సినిమాలో వాడిన గుర్రాన్ని సెంటిమెంట్ గా వాడానని చెపుతూ తన తండ్రి చిరంజీవి మాత్రం తనకు అలవాటు లేని ఒక అందమైన గుర్రం పై మోజు పడటంతో ఆ గుర్రం పై చిరంజీవి సీన్స్ చిత్రీకరించామని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఆగుర్రం తనతండ్రి కంట్రోల్ చేయగలుగుతాడా అని తాను భయపడుతూ ఉంటే తన అంచనాలు తలక్రిందులు చేస్తూ గుర్రాన్ని ఒక్క క్షణంలో తన కంట్రోల్ లోకి తెచ్చుకున్న చిరంజీవిని చూడగానే తనకు నిజమైన మెగా స్టార్ కనిపించాడని కామెంట్స్ చేసాడు రామ్ చరణ్.
ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవి 150వ సినిమా గురించి మరో మెగా ట్విస్ట్ ఇచ్చాడు రామ్ చరణ్. మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా చిరంజీవి 150వ సినిమా ‘కత్తి’ అన్న విషయం తాను ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేనని తన తండ్రి చిరంజీవి నటించబోయే 151 – 152 సినిమా కథలు రెడీ అయిపోయినా అసలైన 150వ సినిమా కథ విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి అంటూ ‘కత్తి’ రీమేక్ విషయాన్ని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచాడు రామ్ చరణ్..