నటుడుగా 573 సినిమాలు నిర్మాతగా 72 సినిమాల ట్రాక్ రికార్డు ఉన్న మోహన్ బాబు నాలుగు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఎన్ని ఊహించని మలుపులు మరెన్నో ఎత్తు పల్లాలు చూసిన వ్యక్తి.  అక్కినేని నందమూరిల తరువాత ఒక విభిన్నమైన వ్యక్తిత్వం మోహన్ బాబు సొంతం. అందుకే అతడు సినిమాలలో నటించినా నటించకపోయినా అతడి ఇమేజ్ కొనసాగుతూనే ఉంది.

ఈరోజు విశాఖపట్నంలో దాదాపు 40 మంది సినిమా ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖుల నేపధ్యంలో తన 40 సంవత్సరాల సినిమా జీవిత మొహత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న మోహన్ బాబు ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించి అలాగే ప్రస్తుత సినిమా రంగ పరిస్థితి గురించి అనేక ఆ సక్తికర కామెంట్స్ చేసాడు.  

తాను నిర్మాతగా 72 సినిమాలు చేసినా ఇప్పటి వరకు తాను ఎవరికీ ఒక్క రూపాయి కూడ ఎగ్గొట్ట లేదు అని అంటూ ప్రస్తుతం సినిమా రంగంలో నిర్మాతలు సినిమాలలో నటిస్తున్న నటీనటులకు డబ్బులు ఎగ్గొట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించాడు మోహన్ బాబు.  ఇప్పటి తెలుగు సినిమా రంగ నిర్మాతల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారు అయింది అని ఒక దర్శకుడు హిట్ కొడితే అతడి చుట్టూ తిరుగుతూ 50 లక్షలు అర్హుడైన ఆ వ్యక్తికి 3 కోట్ల పారితోషికం ఇస్తూ బడ్జెట్ ను విపరీతంగా పెంచివేసి నష్టాలలో కూరుకు పోతున్నారు అంటూ నేటి నిర్మాతల పరిస్థితి పై కామెంట్స్ చేసాడు మోహన్ బాబు.

ప్రస్తుతం తమ సినిమాలకు ఇన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు వచ్చాయి అని చెప్పుకుంటూ అబద్ధాల పై తమ జీవితాలను చాలామంది నిర్మాతలు కొనసాగిస్తున్నారు అని అంటూ ప్రస్తుతం సినిమా రికార్డులకు సంబంధించి వస్తున్న వార్తలు అన్నీ అబద్ధాలే అంటూ నేటి సినిమా రంగ పరిస్థితి పై సెటైర్లు వేసాడు మోహన్ బాబు. తన కోపం తన ఆవేశం వల్ల తాను జీవితంలో ఎంతో నష్టపోయాను అంటూ చాలామందిలా పరిస్థుతులతో  రాజీ పడుతూ తనకు బ్రతకడం రాదు అంటూ తనకు సంచలన వ్యాఖ్యలు చేసాడు మోహన్ బాబు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న వారసుల సినిమాల పై కామెంట్ చేస్తూ పెద్ద దర్శకులు  చిన్న దర్శకులు అన్న తేడా తనకు లేదని ‘బాబ్బాబు మావాడితో సినిమా తీయండి’ అంటూ టాప్ దర్శకుల వెంటపడి వారికి పది సార్లు ఫోన్ చేయవలసిన పరిస్థితి తనకు లేదు అంటూ నేటి టాప్ డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడు మోహన్ బాబు.

తాను తిండికి లేక ఆకలితో రోడ్డు పక్కన పడుకున్న రోజులు తనకు ఇంకా గుర్తు ఉన్నాయి అని అంటూ ఆ బాధలు ఏమిటో తనకు తెలుసు కాబట్టి తన పిల్లలు ఐశ్వర్యంలో పెరిగినా ఎదుటి మనిషి కష్టాలు విని చెలించిపోయే మనస్తత్వం ఉంది అని అంటూ తన ముగ్గురు పిల్లలు వారివారి రంగాలలో రాణిస్తూ ఉంటే వారి ముగ్గురుని చూసుకుంటూ తృప్తిగా బ్రతికేస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు.  ఈరోజు 40 వసంతాల సినిమా జీవిత పండుగను జరుపుకుంటున్న మోహన్ బాబు తన సినిమా జీవిత స్వర్ణోత్సవం కూడ జరుపుకోవాలని ఎపి హెరాల్డ్ మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: