సినిమా కలెక్షన్లలో హద్దులే లేవంటోంది బాలీవుడ్. 100 కోట్లు కాదు.. 200 కోట్లు కాదు.. ఏకంగా ఒక్కో సినిమాకు వెయ్యి కోట్లను టార్గెట్ చేస్తోంది. మైండ్ బ్లాక్ చేసే రేంజ్ లో బాలీవుడ్ ప్లానింగ్ చేస్తోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు సినిమా హిట్టుకు ఇస్తున్న కోలమానం 100 రోజులు కాదు.. 100 కోట్ల కలెక్షన్లు. వంద కోట్లు సాధిస్తేనే సినిమాను హిట్ అంటోంది బాలీవుడ్. అయితే రానురాను ఈ లెక్కలు కూడా మార్చేస్తామంటోంది బాలీవుడ్. సినిమా హిట్టుకు సంప్రదాయ సరిహద్దులన్నింటిని చెరిపేసి.. రానున్నరోజుల్లో వందకోట్లు ఓ లక్ష్యం కానే కాదని.. 1000 కోట్ల వసూళ్లను రాబడుతామంటూ బాలీవుడ్ కసరత్తులు మొదలు పెడుతోంది. తాజాగా ఫిక్కీ ఫ్రేమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ప్లానింగ్ అండ్ మేకింగ్ 1000 క్రోర్ బ్లాక్ బస్టర్' అనే సదస్సులో బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులతోపాటు కరణ్ జోహార్ కూడా పాల్గొన్నాడు. ఈ సమావేశంలో కరణ్ జోహార్ సంచలన ప్రకటన చేశాడు. ఇక ముందు వంద కాదు.. వెయి కోట్లు వసూలు చేసే సినిమాను నిర్మిస్తానంటూ కరణ్ జోహర్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. త్వరలోనే బాక్సాఫీసు బద్దలు కొట్టే చిత్రాన్ని నిర్మిస్తానంటూ సినీ పండితులను సైతం ఆలోచనలో పడేశాడు. హిట్ కావాలంటే.. విద్యావ్యవస్థలోని లోపాలు తెలిపిన '3 ఇడియెట్స్' ప్రేక్షకులందరికి చేరువైందని.. అలాగే ఎప్పుడో వచ్చి.. భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డులను కొల్లగొట్టిన మసాల చిత్రం 'షోలే', కుటుంబ కథా చిత్రాలు హమ్ ఆప్ కే హై కౌన్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, చిత్రాల కథలు అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయని.. ఈ చిత్రాల్లో సాంకేతిక విలువలు ఇప్పటిలా లేవని.. అయినా ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయని కరణ్ తెలిపాడు. ప్రేక్షకులకు నచ్చాలంటే.. సాంకేతిక విలువలతోపాటు.. కథ కూడా ప్రాణమేనని ఆయన అన్నారు. చిత్ర కథ ప్రేక్షకులకు నచ్చే విధంగా యూనివర్సల్ టచ్ ఉండాలని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. సక్సెస్ ఫుల్ మూవీ మేకర్ కరణ్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు హిట్ సినిమాలను తీసి సంచలన రికార్డులు క్రియేట్ చేశాడు. 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన కరణ్, తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వసూళ్లు సాధించడంలో బాలీవుడ్ లో రికార్డు నెలకొల్పింది ఆ సినిమా. తరువాత మరి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన కరణ్, నిర్మాతగా మారి గొప్ప విజయాలను దక్కించుకున్నాడు. కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, కభీ అల్విదా నా కహనా, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారు కరణ్. మొత్తానికి కరణ్ జోహర్ వెయ్యి కోట్ల కలెక్షన్ల సంచలన ప్రకటన బాలీవుడ్ కు కొత్త ఊపిరి ఇస్తోంది. హాలీవుడ్ తరహాలో బాలీవుడ్ కూడా వరల్డ్ వైడ్ గా నిలదొక్కుకోవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: