తెలుగుతల్లి అంటే... తెలుగుతల్లి అనుకోవద్దు. తెలుగు తల్లి అంటే... తెలుగు సినిమాల్లో తల్లి అని అర్థం. ఒక్కసారి పాత తెలుగు సినిమాలను గుర్తుతెచ్చుకోండి. హీరో లేదా హీరోయిన్ తల్లి అంటే... భర్త చనిపోయిన ఒక పెద్ద వయసు స్త్రీ కనిపిస్తుంది. అది అన్నపూర్ణమ్మ కావచ్చు... నిర్మలమ్మ కావచ్చు... తాళ్లూరి రామేశ్వరి కావచ్చు. దీనమైన ముఖం పెట్టుకుని, సెంటిమెంటుకు మారుపేరుగా ఉండేదా తల్లి. కానీ, ఇప్పుడు తెలుగు తల్లి మారిపోయింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం... మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా. ఆ ఒక్క సినిమాతోనే అందరి మెప్పునూ పొందింది నదియా. నిజానికి తెలుగుతల్లి ఇలా మారడం ఇటీవలే మొదలైంది. నగ్మా, రోజా, రమ్యకృష్ణ, అమల... వీళ్లంతా మారిన తెలుగు తల్లులే.  నా అల్లుడులో కథానాయికల తల్లిగా కనిపించింది నగ్మా. అలాగే, రమ్యకృష్ణ కూడా చాలా సినిమాల్లో అత్తపాత్రలో కనిపించింది. మొగుడు సినిమాలో తాప్సీ తల్లిగా నటించింది రోజా. ఇలా ఇప్పుడు తెలుగు తల్లి మారిపోయింది. వృద్ధాప్యాన్నీ వైధవ్యాన్నీ కూడా వదిలేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: