వేస‌విలో కొత్త సినిమాల హోరు ఈసారి కాస్త ఎక్కువ‌గానే క‌నిపించ‌నుంది. బాద్‌షా, షాడో, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, గ్రీకువీరుడు, తుఫాన్‌, ఎవ‌డు ఈ సినిమాల‌న్నీ ఒక‌దాని త‌ర‌వాత మ‌రొక‌టి క్యూ క‌ట్ట‌నున్నాయి. సినిమా సినిమా మ‌ధ్య క‌నీసం రెండు మూడు వారాల వ్య‌వ‌థి ఉంటుంది కాబ‌ట్టి, థియేట‌ర్ల స‌మ‌స్య ఉండ‌దు. కానీ ఒక్క‌టే భ‌యం... క్రికెట్‌. ఏప్రిల్ మొద‌టి వారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి క్రికెట్ గ‌త సీజ‌న్‌ల‌లోనూ తెలుగు సినిమాకి గ‌ట్టి పోటీ ఇచ్చింది. తెలుగు సినిమా అనేమిటి? బాలీవుడ్ కూడా ఐపీఎల్ దెబ్బ‌కు హ‌డ‌లిపోయింది. కొన్ని సినిమాల‌ను వాయిదా వేసుకొన్నారు. ఈసారీ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పొట్టి క్రికెట్ దెబ్బ‌కు ఫ‌స్ట్ షో, సెకండ్ షో వ‌సూళ్ల‌కు గండి ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని సినీ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దాదాపుగా 30 నుంచి 40 శాతం వ‌సూళ్లు త‌గ్గే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. సినిమా వ‌సూళ్లు భారీగా ఉండాలంటే యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకోవాల్సిందే. అయితే వారంతా టీవీల‌కు అతుక్కుపోతే... పెద్ద సినిమాల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌ర‌మే. చిన్న సినిమా అయితే అస‌లు చెప్ప‌క్క‌ర్లెదు. దేని వ్యాపారం దానిదే.. అని ఇంకొంత‌మంది ధైర్యంగా ఉన్నారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూస్తార‌నేది వారి ధీమా. అదీ నిజమే కావ‌చ్చు. అయితే.. తొలి రెండు వారాల్లోనే భారీ మొత్తం దండుకోవాల‌ని చూసే బాద్‌షా, షాడో లాంటి సినిమాల‌కు ఐపీఎల్ ఆకటంక‌మే. ఎందుకంటే కీల‌క‌మైన మ్యాచ్‌లు ఉంటే అటెన్ష‌న్ అంతా టీవీపైనే ఉంటుంది. సినిమా ఎక్క‌డికీ పోదు, రేపు కూడా ఉంటుందులే.. అనేది స‌గ‌టు ప్రేక్ష‌కుడి మాట‌. అందుకే సినిమాని లైట్ తీసుకొని... ఇంటికే ప‌రిమిత‌మ‌వుతారు. మ‌రో వైపు ఎండ‌ల తాకిడి పెరుగుతోంది. ప‌గ‌టి పూట‌... బ‌య‌ట‌కు రావ‌డానికే జ‌నాలు భ‌య‌ప‌డే స్థాయికి వ‌స్తే... మార్నింగ్ షోలూ నిల్లే. అటు క్రికెట్‌.. ఇటు ఎండ‌లూ ఇవి రెండూ తెలుగు సినిమా వ‌సూళ్ల‌ను పూర్తి స్థాయిలో ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ గండం నుంచి సినిమా ఎలా గ‌ట్టెక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: