తేట తేట తెలుగు పదాలతో.. తెల్లవారి వెలుగులాంటి పాటల్ని వేలాదిగా రాసిన మనసు కవి.. మన..సుకవి.. ఆయన. నిన్ను నిన్నుగ ప్రేమించుటకు.. నీ కోసమే కన్నీరు నించుటకు.. నేనున్నానని నిండుగ పలికే.. అంటూ తన తరం కవుల పైనే కాకుండా తన తర్వాత తరం కవుల మీద కూడా బలమైన ముద్ర వేసిన కవి.. రచయిత..దర్శకుడు.. దార్శినికుడు.. ఆచార్య ఆత్రేయ. ఈ రోజు ఆత్రేయ జయంతి. ఈ సందర్భంగా మనసు కవి గీతాంజలి విశేషాలు మీ కోసం.

మనసుని ఏ దిశలో ఏ దశలో ఏ విధంగా పోగొట్టుకున్నారోగాని.. పోగొట్టుకున్న మనసు వెతికే వెంపర్లాటలో వచ్చిన ఆలోచనలను చిన్న చిన్న పదాలతో, తేలికగా అర్థమయ్యే లా రాసిన కవి ఆత్రేయ. ఆర్తి.. ఆవేదన.. ఆశ.. ఆందోళన.. అభిమానం.. అనురాగం.. ఆప్యాయత అన్ని కలగలిపి మళ్ళీ మళ్ళీ పాడుకునేలా మనసు మీద గీతాలు రాసి మనసుకవి అనిపించుకున్నారాయన.

సిక్స్ టీస్ లో ఆత్రేయ మరో స్పెషాలిటీ సాధించారు. ఈ డికేడ్ లో ఆయన హార్ట్ స్పెషలిస్టు అయ్యారు. తేనెమనసులు, కన్నెమనసులు, కలిసిన మనసులు , మూగ మనసులు ఇలా మనసు తో అంతమయ్యే టైటిల్ ఉన్న సినిమాటన్నింటికీ ఆయనే కలంతోనే మనసు పాటలను పలికించారు. అలా మనసు కవిగా మారారు. ఇప్పటికీ తెలుగు లో మనసు మీద వచ్చిన మనసైన పాటలు ఏంటంటే మన మనసుకు వెంటనే తట్టే పాట ఇదే... ఈ పాటలోని ఒక లైన్ విన్న సి. నారాయణ రెడ్డి ఆ ఒక్క వ్యాక్యం వెయ్యి వాక్యాల పెట్టు అన్నారంటే ఆయన మనసు ఎంత లోతైనదో అర్ధమౌతుంది.

పచ్చ గడ్డి కొసేటి పడుచు పిల్లా..
జాన పదాల నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకుని పాపులర్ పాటలు రాయడంలో కూడా ఆత్రేయ సిద్దహస్తుడు. ఎన్నో పాపులర్ జానపద పల్లవులు తీసుకుని ఎన్నో మంచి పాపులర్ సాంగ్స్ రాశారు. ఈ పాటలన్నీ ఆ సినిమాల విజయంలో పాత్ర పోషించినవే.

''ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్ధలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు..'' అంటూ.. 'ప్రేమనగర్'లో అద్భుతమైన డైలాగ్స్ రాసిన ఆత్రేయ వేల ఎకరాలు సంపాదించుకోలేదు గాని.. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తన పాటలతో చిరస్మరణీయుడయ్యాడు.

నేనొక ప్రేమపిపాసిని..
ప్రేయసి కోసం ఎదురు చూసి చూసి అమె నుంచి ఏమీ బదులు రాక చివరకు నిరాశగా వెనుతిరిగే ఒక ప్రియుడి ఆవేదనను తన పాట రూపంలో చెప్పాడు ఆత్రేయ. ఆత్రేయ జీవితంలో ప్రేమ విషాదాన్ని చవి చూసి.. భగ్నప్రేమికుడయ్యాడని.. అందుకే అంత అద్భుతంగా రాయగలిగాడని అంటారు. తలుపు మూసిన తలవాకిటనే.. పగలు రేయి నిలుచున్నా.. పిలిచి పిలిచి బదులేరాక.. అలసి తిరిగి వెళుతున్నా... అంటూ తన అనుభవాల్నే కవిత్వీకరించాడని.. అంటారు.

తేట తేట తెలుగులా..
తెలుగు కమనీయదనాన్ని ఒక అందమైన అమ్మాయికి అన్వయిస్తూ గమ్మత్తు చేశాడు ఆత్రేయ. ప్రేమనగర్ చిత్రంలోని ఘంటసాల గళం నుంచి జాలువారిన తేటతేట తెలుగులా పాటకు మహదేవన్ సంగీతం మరింత అందాన్నిచ్చింది. అందుకే ఆత్రేయ రచనల్లో ఈ పాట ఎప్పటికీ తెలుగు వారికీ గర్వ కారణంగా నిలిచే ఉంటుంది.

చిటపట చినుకులు పడుతూ వుంటే..
ఆత్రేయ రాసిన యుగళగీతాలు యూత్‌ను ఉర్రూతలూగిస్తాయి. తెలుగు ప్రేమికులు మాత్రం ఆత్రేయ పాటల్ని ఎప్పటీకి మర్చిపోలేరు. ఆత్రేయ కలం నుంచి వచ్చిన విరిజల్లే - "చిటపట చినుకులు పడుతూవుంటే ... పాట మొదటి వర్షపు పాటగా చెప్పుకోవచ్చు.

జాబిల్లి కోసం ఆకాశమల్లే..
ఆకాశమంటే శూన్యం.. నల్లని చీకటి ఆకాశానికి ఒక అందాన్ని.. అర్థాన్ని ఇచ్చేది చల్లని జాబిల్లి. ఆ జాబిల్లి రాక కోసం ఆకాశం ఎలా ఎదురు చూస్తుందో అలా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను , నీవు లేకపోతే నా జీవితం శూన్యం అంటూ ఎంత సింపుల్‌గా , ఎంతో అద్భుతంగా రాశారు ఆత్రేయ.

ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ ప్రాణం పోశాడు. ఆత్రేయ వేదాంత ధోరణి,జీవిత రహస్యం తెలిసిన వాడుగనుకనే "ఎందరో మహానుభావులు, మహాత్ములు...." అనే వాక్యాన్ని ఆ పాత్రతో ఆత్రేయ చెప్పిస్తాడు. ఆత్రేయ రాసిన మాటలను తన నోట పలికి ఏఎన్నార్ ఆ సన్నివేశానికి ప్రాణం పోశాడు.

మనిషి, మనసు, మమతా - వీటికి సంబంధించి అనేక పాటలు రాశారు ఆచార్య ఆత్రేయ. ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. ఆత్రేయ పాటల్లో ప్రత్యేకతలు ఏమిటంటే - మనుషుల మనసులని, మమతలని, స్వభావాలతో పాటు, తత్వాన్ని రంగరించి పాటలు రాశారు. చిత్త శుద్ధి కలిగి ఉంటాయి ఆయన భావాలు. అందుకనే వీటిని హాయిగా పాడుకుంటూనే వున్నారు తెలుగు వారు. మనిషి మనసునీ తత్వాన్ని అచ్చ తెలుగులో అత్యంత రమణీయంగా.. హృదయానికి హత్తుకు పోయేలా పాటలు రాశారు అచార్య ఆత్రేయ.

నటుడుగానూ..
ఆత్రేయ చివరిదశలో హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన "భామాకలాపం" సినిమాలో అతిధి పాత్రలో నటించారు. "కోడెనాగు", "ఆదర్శం" వంటి సినిమాల్లో కూడా కనిపిస్తారాయన. ఇలా ఆత్రేయ మూడు సినిమాలలో నటించాడుగాని స్వయంగా తాను నిర్మించిన వాగ్దానం చిత్రంలో నటించే అవకాశం ఉన్నా నటించలేదు. అంత శ్రద్ధవహించి చిత్రాన్ని నిర్మించినా సినిమా ఆడక ఆత్రేయ నష్టపోయారు. మరెప్పుడు సినిమా తీయనని ఆత్రేయ "వాగ్దానం"చేసినట్లు అందరూ అంటుంటారు.

కన్నె పిల్లవని కన్నులున్నవని..
అప్పటిలో కొత్త పంథాలో ఆత్రేయ అందించిన ఆకలిరాజ్యంలోని పాట-" కన్నె పిల్లవని కన్నులున్నవని.."ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే, సంగీతానికి పదం సమకూర్చటం. ఈ ప్రయోగం - బాగా ఫలించింది. అటు ప్రేమికుల జంట పాడుకున్నదిగా చూపించి, తనలోని కవి హృదయానికి ప్రేరణ ఇచ్చి, చిక్కనైన తెలుగు లో చక్కటి పాట సృష్టించారు. సంగీత ప్రియులను బాగా ఆకట్టుకున్నారు.

యే తీగ పూవునో..
సమయానికి పాట రాయక నిర్మాతలను ..పాట రాసిన తరువాత ప్రేక్షకులను ఏడిపిస్తాడనే పేరు ఆత్రేయకు ఉంది. ఆయన పాట రాయడానికి ఎక్కువ సమయం తీసుకుండే వాడట.. అయితేనేం భావ యుక్తంగా, రసాలొలికిస్తూ ఉంటాయి ఆయన పాటలు. నాలుగు దశాబ్దాలపాటు - భక్తి, భావ, శృంగార, దేశ భక్తి రసాలొలికిస్తూ జనరంజకమైన మాటా-పాటలను అందించి చెరగని ముద్ర వేశారు.

సంగీత ప్రియులు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకునేలా మధురమైన మనసుగీతాలు రాసిన ఆచార్య ఆత్రేయ 1989 సెప్టెంబర్ 9న కన్నుమూశారు. భౌతికంగా ఆయన లేకపోయినా తెలుగు వారి మనసులలో శాశ్వతంగా గూడు కట్టుకున్నారు. ఆయన రాసిన పాట, మాటలలో చెప్పాలంటే - " పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ". ఆత్రేయ గురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు.. ఆత్రేయ ఒక అద్భుతం!

మరింత సమాచారం తెలుసుకోండి: