జూనియర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్‌ లో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న మూవీకి సంబంధించి బయటకు వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈసినిమా కోసం 30 సంవత్సరాలుగా హాలీవుడ్ సినిమా రంగంతో అనుభవం ఉన్న వాన్స్ హార్ట్‌వెల్ ను రంగంలోకి దింపడం సంచలనంగా మారింది.

ప్రోస్థైటిక్ మేకప్ కింగ్ గా పేరు గాంచిన వాన్స్ హార్ట్ వెల్ ఈసినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్‌ అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి సహకారం అందించడానికి ఈమధ్యనే హైదరాబాద్ వచ్చి ఈసినిమా యూనిట్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 

అంతేకాదు జూనియర్ ఫేస్ కు బాడీకి సంబంధించిన కొలతలు కూడ తీసుకుని హార్ట్ వెల్ తిరిగి అమెరికా పయనం ఐనట్లు టాక్.  గతంలో ఇతడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఐరన్‌మేన్, లైఫ్ ఆఫ్ పై, రోబో లాంటి సినిమాలకు పనిచేసిన నేపధ్యం ఉంది. అత్యంత ఖరీదైన గ్రాఫిక్స్ ఎక్స్ పర్ట్ గా పేరు గాంచిన హార్ట్ వెల్ ను జూనియర్ కొత్త సినిమా కోసం రంగంలోకి దింపడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ప్రప్రధమంగా జూనియర్ తన కెరియర్ లో ఈసినిమాకు సంబంధించి త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ‘జై లవకుశ’ అన్న టైటిల్ తో నిర్మింపబడే ఈసినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభం కాబోతోంది.  ఈసినిమాలో జూనియర్ నటిస్తున్న మూడు డిఫరెంట్ పాత్రలకు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు.  దీనికోసం జూనియర్ తన లుక్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

ఈ మూవీలో జూనియర్ చేస్తున్న మూడు పాత్రలలోనూ ఒకటి పూర్తిగా నెగిటివ్ రోల్. ఇప్పటి వరకు జూనియర్ తన కెరియర్ లో నెగిటివ్ పాత్ర చేయని నేపధ్యంలో ఈ నెగిటివ్ పాత్ర బాడీ లాంగ్వేజ్ కోసం జూనియర్ చాల పెద్ద హోమ్ వర్క్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటి వరకు ఈసినిమాకు సంబంధించి ఒక్క రాశి ఖన్నా తప్పించి మిగతా హీరోయిన్స్ ఎంపిక కాని నేపధ్యంలో హీరోయిన్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: