పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో తన భావాలను ప్రచారం చేసే ఒక శతఘ్ని టీమ్ కు నిన్న శ్రీకారం చుట్టాడు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ శతఘ్ని టీమ్ కు ఎంపిక అయిన ప్రతినిధులతో నిర్వహించిన ఒక లైవ్ ఛాట్ కార్యక్రమాన్ని అన్ని ప్రముఖ ఛానల్స్ ప్రముఖంగా ప్రచారం చేసాయి. 

ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పవన్ ఒకరోజు ముందుగానే మీడియా ముందుకు వచ్చి అనేక ఆసక్తికర విషయాల పై తన అభిప్రాయాలను వెల్లడించాడు. అనేక మంది యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు పవన్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్ ప్రకటించడం ఆశ్చర్య కరంగా మారింది.

2018 చివరినాటికి తమ పార్టీ ఎన్ని సీట్లలో పోటీచేస్తోందనే విషయమై స్పష్టత వస్తుందని అంటూ మరో నెలరోజులలో తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తాను అన్న విషయాన్ని మళ్ళీ వెల్లడించాడు. అంతేకాదు ‘జనసేన’ పట్ల ప్రజలు ఏ రకంగా స్పందిస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది అని అంటూ 2018 చివరినాటికి మాత్రమే తమ పార్టీపై ఒక అంచనాకు రానున్నట్టు పవన్ అభిప్రాయపడ్డాడు. 

ఇదే సందర్భంలో పవన్ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.  ప్రజారాజ్యం పార్టీ ఫెయియ్యాక ప్రతిదాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి తనకు ఏర్పడిందని అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రజా సేవ చేయడమంటే సీట్లు గెలవడమే కాదు అంటూ  ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పవన్ అంటున్నాడు.

సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ‘జనసేన’ పార్టీని మరింత చేరువ చేయాలని పవన్‌ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలలో అతడు ఏర్పాటు చేసిన శతఘ్ని డిజిటల్ టీమ్‌ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే జనం మధ్యకు వెళ్ళకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయి అన్న విషయం పై ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: