ఈనెల 22వ తారీఖున విడుదల కాబోతున్న అఖిల్ ‘హలో’ సక్సస్ అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈసినిమా ప్రమోషన్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగార్జున. వాస్తవానికి అఖిల్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘హలో’ మాత్రమే అన్న పద్ధతిలో నాగ్ ప్రమోషన్ కొనసాగుతోంది.

ఇలాంటి పరిస్థుతులలో నాగ్ ఈమధ్య ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈసినిమా కథకు సంబంధించిన కొన్ని లీకులు ఇచ్చాడు. ఈసినిమా కథ అంతా ఉదయం 7.30 నిముషాలకు ప్రారంభం అయి సాయంత్రం 5.30 నిముషాలకు ముగిస్తుందట. సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలు అన్నీ ఈ పది గంటల సమయంలోనే వస్తాయని నాగ్ చెపుతున్నాడు. 

అయితే ఈ సన్నివేశాలతోపాటు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడ ఉంటుంది అని అంటున్నాడు నాగార్జున. దీనినిబట్టి చూస్తుంటే దర్శకుడు విక్రమ్ కుమార్ ‘హలో’ సినిమాకు కూడ తన స్క్రీన్ ప్లే విషయంలో మ్యాజిక్ చేస్తూ ‘మనం’ తరహా టెక్నిక్ ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటువంటి స్క్రీన్ ప్లే టెక్నిక్స్ మాస్ ప్రేక్షకులకు పెద్దగా అర్ధం కావు. 

ఇప్పటికే అఖిల్ మార్కెట్ స్థాయికి మించి అత్యంత భారీ బడ్జెట్ ఈసినిమా పై పెట్టారు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలాంటి వెరైటీ టెక్నిక్ స్టోరీలను మాస్ ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అఖిల్ ‘హలో’ నాని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్ సి ఏ’ తో పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో అఖిల్ కు ‘హలో’ పెద్ద పరీక్షే పెట్టబోతోంది అన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: