ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో న‌టుడు, ద‌ర్శకుడు మాత్రమే కాదు, మంచి గాయ‌కుడు కూడా ఉన్నాడు. అందుకే ఆయ‌నకు వీలైన ప్రతీసారీ గ‌ళం విప్పుతుంటారు. క‌నీసం ఓ చిన్న కూనిరాగ‌మైనా తీస్తుంటాడు. త‌మ్ముడులో తాటి చెట్టు ఎక్కలేవు, తాటి క‌ల్లు తెంప‌లేవు అంటూ మ‌ల్లిఖార్జున‌రావును పాడుతూ ఆట‌ప‌ట్టించాడు. ఆ త‌ర్వాత ఖుషీలో బై బ‌య్యే ర‌మ‌ణ‌మ్మ బాయి చెట్టుకాడ బోరింగు ర‌మ‌ణ‌మ్మ అంటూ అలీతో క‌లిసి శ్రీకాకుళం పాటేసుకొన్నాడు. జానీలోనూ ఇలాంటి ఓ చిన్న పాట పాడాడు. అంతెందుకు మొన్న గ‌బ్బర్‌సింగ్‌లో కూడా ఎవ‌డు డ‌ప్పు వాడు కొట్టండెహే అంటూ త‌న‌దైన శైలిలో పాట‌లో మాట‌సాయం చేశాడు. ఇప్పుడు ఆయ‌నతో దేవిశ్రీప్రసాద్ ఏకంగా పూర్తిస్థాయి పాట ఒక‌టి పాడించారు.

కాటం రాజ... అంటూ సాగే ఆ గీతం అత్తారింటికి దారేదిలో ఉంది. ఇదివ‌ర‌కే ఈ సినిమాలోని పాట‌లు విడుద‌లైనా ప్రచార ఎత్తుగ‌డ‌లో భాగంగా పాట‌ను క్యాసెట్‌లో లేకుండా ప్రత్యేకంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణయించారు. ఆ పాట‌ను ఆదివారం రోజు ఉద‌య‌మే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ పాట గురించి ఇప్పటికే ప‌రిశ్రమ‌లో చాఆ మందికి తెలుసు. పవ‌న్ ఆ పాట‌ను పాడిన విధానం, దాన్ని తెర‌కెక్కించిన విధానం అదిరిపోయింద‌ట‌. ఈ పాట‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ యూట్యూబ్‌లో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారు.

త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తుంది. స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మాత‌. క్లీన్ యు స‌ర్టిఫికెట్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అల‌రించేలా ఉంటుంద‌ని అంటున్నారు నిర్మాత‌.

మరింత సమాచారం తెలుసుకోండి: