అపూర్వ సౌందర్యంతో, ముద్దులొలికే మాటలతో, సాటిలేని అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో దశాబ్దాల తరబడి తిష్టవేసిన అందాల రాక్షసి ... తెలుగు, తమిళ,హిందీ సినిమా రంగాలను ఓ ఊపు ఊపిన నటి   శ్రీదేవి..  
  
తమిళనాడులోని శివకాశీలో 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయంగర్ అయ్యప్పన్. ఆమె  తల్లి రాజేశ్వరి తిరుపతికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి అయ్యప్పన్ తమిళ వ్యక్తి. ఆయన న్యాయవాదిగా పనిచేసేవారు. సినిమాల్లోకి వచ్చాక ఆమె శ్రీదేవిగా మారారు.ఆమె  నాలుగవ ఏట 'తునైవన్' తో బాలనటిగా అడుగుపెట్టారు. ఎం.ఏ. తిరుముగమ్ రూపొందించిన తమిళ చిత్రమది. బాలనటిగా తెలుగులో 'మా నాన్న నిర్దోషి' , హిందీలో 'జూలీ'  (1975), కన్నడలో 'భక్త కుంభర' లో నటించారు. 13 ఏళ్ల ప్రాయంలో తమిళంలో 'మూండ్రు ముడిచ్చు'(1976 )తో ఆమె హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.తెలుగులో నాయికగా తొలి చిత్రం'అనురాగాలు'(1976).అందులో అంధురాలిగా మెప్పించారు.హిందీలో నాయికగా తొలి చిత్రం 1979 లో వచ్చిన 'సాల్వ సావన్' చిత్రం.

Image result for sridevi childhood photos

 శ్రీదేవి 1977 లో తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న డ్రీమ్ గర్ల్. భారతిరాజా తొలి చిత్రం 'పదినారు వయదినిలే' శ్రీదేవి పోషించిన గ్రామీణ యువతి పాత్ర పేరు 'మయిలు' (నెమలి). ఆ చిత్రం లో శ్రీదేవి పురివిప్పిన నెమలివలే అందాలు ఆరబోసి  'సేంధుర పూవే ' పాటలో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది.  ఆమె అత్యధికంగా కమల్ హాసన్ తో 27 చిత్రాల్లో నటించింది. రజనికాంత్ తో 12 చిత్రాల్లో నటించింది. తమిళంలో మొత్తం 73 చిత్రాల్లో నటించింది. దాదాపు అన్ని చిత్రాలు హిట్ గానే నిలిచాయి. తమిళంలో 'బాబు' సినిమాలో శివాజీ మనమరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత 'కవరిమాన్' చిత్రంలో ఆయన కుమార్తెగా ఆ తర్వాత 'పట్టకత్తి బైరవన్' చిత్రంలో హీరోయిన్ గా నటించడం విశేషం.

Image result for sridevi childhood photos

 తెలుగులో  కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'పదహారేళ్ళ వయసు' చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సక్సెస్ పరంపర దర్శకేంద్రుడితో 24 సినిమాల వరకు నడిపించింది. ఒకే దర్శకుడితో  ఒక హీరోయిన్ వరుసగా 24 చిత్రాలకు పనిచేయడం అంటే అషా మాషీ కాదు అని ఇది ఒక రికార్డ్ అని రాఘవేంద్రరావు తరచూ చెపుతూ ఉంటారు.  బాలనటిగా హీరో కృష్ణ కాంబినేషన్ లో ఐదారు చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఆయన పక్కన నటించిన  తొలి సినిమా ' బుర్రిపాలెం బుల్లోడు '. తెలుగులో అత్యధికంగా హీరో కృష్ణ గారితో 31 చిత్రాల్లో నటించింది.
Image result for పదహారేళ్ల వయసు
ఎన్ టి రామారావు గారితో 12 సినిమాల్లో నటించారు.ఆయనతో నటించిన వేటగాడు చిత్రం అప్పట్లో సంచలన విజయాలు నమోదు చేసింది.అక్కినేని నాగేశ్వర్ తో నాగార్జున తో తండ్రి కొడుకులతో హిట్ సినిమాలు చేసిన ఘనత తనది. అప్పట్లో తెలుగు  సినిమా అగ్రహీరోలందరితో ఆడి పాడింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అందరూ మరచిపోని జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం లోని  ' అబ్బనీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బ'  పాటలో చిరంజీవి తో చేసిన ఆ డాన్స్ కోసమే మూడు నాలుగు సార్లు వెళ్లిన ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Image result for ఎన్టీఆర్ శ్రీదేవి

 నిజానికి హిందీ సినిమా కెరీర్ ప్రారంభం  లో శ్రీదేవికి అంత సక్సెస్ లు రాలేదు.    కానీ 'హిమ్మత్ వాలా' తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది.1983 నుంచి దాదాపు పదేళ్ల పాటు హిందీ సినిమాల్లో శ్రీదేవి పేరు మార్మోగిపోయింది. కనీసం ఏడో తరగతి కూడా దాటని ఓ అమ్మాయి , హిందీ ఏ మాత్రం రాని ఒక దక్షిణాది అమ్మాయి ఆ చిత్రసీమలో టాప్ స్టార్ గా రాణించడం అందరూ చెప్పుకున్న వింత.ఆ రోజుల్లో 'థండర్ థైస్ శ్రీదేవి' అనే మాట ఆమె గురించి అప్పట్లో మాస్ జనం చెప్పుకున్న  మాట, ఇచ్చుకున్న  బిరుదు. దాదాపు అక్కడ కూడా టాప్ హీరోలతో నటించింది. 'మిస్టర్ ఇండియా' (1897) సినిమా తో కొత్త శిఖరాలు అధిరోహించారు.1980-1990 మధ్య కాలంలో  అత్యధిక పారితోషికం అందుకున్న నాయికగా శ్రీదేవి పేరు వినిపించేది.

Image result for నాగేశ్వరరావు శ్రీదేవి

 తొంభైయ్యో దశకం వచ్చాక పరిస్థితులు క్రమంగా మారాయి. శిఖరం పైన నిలబడ్డ    కెరీర్ లో, జీవితం లో పెనుగాలుల్లో చిక్కుకున్నారు. తండ్రి మరణం, అమెరికన్ హాస్పిటల్ లో అస్తవ్యస్తంగా జరిగిన తల్లి బ్రెయిన్ ఆపరేషన్ ఆమెను వ్యక్తిగతంగా దెబ్బతీసాయి.అప్పటికి ఆమె నటించిన 'ఖుదా గవా '( 1992), గుమ్రహ్(1993), పేరు తెచ్చాయి కానీ ఆశించినంత డబ్బు తేలేకపోయాయి. చివరకు 'రూప్ కి రాణీ చోరాంకా రాజా'(1993) చిత్రం భారీ ఫెయిల్యూర్ తో హిందీలో శ్రీదేవి నంబర్ వన్ స్థానం వదులుకోవాల్సి వచ్చింది.

Image result for sridevi marriage

  1996 జూన్ 2 న బోణికపూర్ తో శ్రీదేవికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత సినిమాలు చేయడం మానేసింది.    1997 మార్చ్ 7 న మొదటి సంతానం గా జాన్వీ కపూర్, 2000 నవంబర్ 5 న రెండవ సంతానం గా ఖుషి కపూర్ లకు జన్మనిచ్చారు.2004 -2005 లో 'మాలిని అయ్యర్ 'తో టీవీ రంగ ప్రవేశం చేశారు. 2004 లో ' జీనా ఇసి కా నామ్ హై' కార్యక్రమంలో కనిపించారు.2005 లో 'కాబూమ్' టీవీ లో జడ్జి గా కనిపించారు.2007 లో 52 వ ఫిలింఫేర్ అవార్డుల షోలో తన చిత్రాల్లోని కొన్ని పాటల మెడ్లికి తొలిసారి వేదిక మీద నృత్యం చేశారు.2007 లో 'హయ్ బ్లిట్జ్' ప్యాషన్ మ్యాగజైన్ మీద 'ది గాడెస్ రిటర్న్స్' అనే టాగ్ లైన్ తో ఆవిడ ఫోటో ప్రచురితమైంది.ఆమె వేసిన పెయింటింగ్స్ అన్ని 2010 లో 'ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఆక్షన్  హౌస్' లో  ఉంచారు. 2011 లో ' మేరీ క్లైర్ ' మ్యాగజైన్ మీద శ్రీదేవి ఫోటో ప్రచురితమైంది. 
 Related image     
 2012 లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ  ఎంట్రీ ఇచ్చింది . కేరళ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్నారు.2013 లో కేంద్ర ప్రభుత్వం నుంచి ' పద్మ శ్రీ' అవార్డ్ తీసుకున్నారు.2015 లో  సిరాక్ ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైలిష్  అవార్డులలో 'అల్టిమేట్ దివా' అవార్డును అందుకున్నారు. భారతీయ సినిమా వందేళ్ల పండుగను పురస్కరించుకుని సిఎన్ఎన్ ఐబీయన్ నిర్వహించిన 'ఇండియన్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్' లో అగ్ర స్థానం లో నిలిచింది. బాలీవుడ్ తొలి ఫిమేల్ సూపర్ స్టార్ గా ఆమెకు పేరుంది.  ఇటీవల దుబాయ్ లో ఆమె మేనల్లుడు మోహిత్ మార్వా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. భారత కాలమానం ప్రకారం 25 ఫిబ్రవరి 2018 రోజున  ఉదయం 2:00 గంటలకు ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్ళింది.


మరింత సమాచారం తెలుసుకోండి: