భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  కేవలం భారత దేశంలోనే కాదు విదేశాల్లో సైతం రజినికాంత్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  అక్కడ కూడా బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రాలు ఉన్నాయి.  ఆ మద్య పా రంజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాబాలి’ చిత్రం ఇక్కడే కాదు విదేశాల్లో కూడా దుమ్మురేపింది.  ఈ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా రజినీ ఆ మద్య శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 చిత్రం షూటింగ్ తో బిజీగా గడిపారు. 

ఇదే సమయంలో పా రంజీత్ దర్శకత్వంలో ‘కాలా ’ చిత్రంలో నటించారు.  రజినీకాంత్ అల్లుడు ధనుష్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘కబాలి’లో కొత్త రజినీకాంత్ చూపించిన దర్శకుడు రంజిత్.. ఇప్పుడు ‘కాలా’లోనూ తలైవాను డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. ‘కాలా’ ఫస్ట్‌లుక్, టీజర్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ముంబైలో తమిళుల కోసం పోరాడే డాన్ పాత్రలో రజినీ కనిపించనున్నారు. ఇక మే డే సందర్భంగా ఈ చిత్రంలోని ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తెలుగులో ‘యమ గ్రేటు’ అంటూ సాగిన ఈ ర్యాప్ సాంగ్ ‘కబాలి’లోని ‘నిప్పురా.. తాకరా..’ పాటను గుర్తుచేస్తోంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ మరోసారి వెరైటీ బీట్, ట్యూన్‌తో అదరగొట్టాడు. ఈ పాటకు తెలుగు లిరిక్స్‌ను ప్రణవ్ చాగంటి అందించారు.

మే 9న ‘కాలా’ పూర్తి ఆడియోను విడుదల చేయనున్నారు. అలాగే సినిమాను జూన్ 7న విడుదల చేస్తారని అంటున్నారు.  కాకపోతే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలపలేదు. హుమాఖురేషి, సముద్రఖని, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, సాయాజీ షిండే, అంజలి పాటిల్, మణికందన్ కీలక పాత్రల్లో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: