సినీసంగీత లోకాన్ని పరవశింపచేసిన గాయకులలో వాణీజయరామ్‌ ఒకరు. తన గాత్రంలోని మాధుర్యంతో మొదట ఉత్తరాదిని పులకింపచేశారు. ఆ తర్వాత దక్షిణాదిన ఎన్నో పాటలతో మైమరపించారు. నేపథ్యగానంలో ఆమె బాణీ ప్రత్యేకమైనది.  జాతీయ ఉత్తమ గాయనీగా మూడుసార్లు అవార్డు అందుకున్న ఆమె ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైం అవార్డు అందుకున్నారు. ఇటీవల నార్త్‌ అమెరికా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. వందలాది పాటలతో, ఆల్బమ్స్‌తో ఆమె స్వరం సంగీతాభిమానులకు నిత్యనూతనం. స్వాతి కిరణంలోని 'ఆనతినీయరా', 'కొండా కోనల్లో లోయల్లో', 'జాలిగా జాబిలమ్మ' తదితర పాటలు ఆమె గాత్రంలోని మధురామృతానికి మచ్చుతునకలు.  


తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లో వాణీజయరామ్‌ పాటకు సంగీతప్రియులు పట్టాభిషేకం చేశారు... కె.బాలచందర్‌ 'అపూర్వరాగంగల్‌' చిత్రం వాణీ జయరామ్‌ ను జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు అందుకునేలా చేసింది. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన 'శంకరాభరణం, స్వాతికిరణం' చిత్రాల ద్వారా మరో రెండు సార్లు నేషనల్‌ అవార్డు అందుకున్నారు. తాజాగా ప్రఖ్యాత గాయని వాణీజయరామ్‌ భర్త జయరామ్‌ సోమవారం ఉదయం చెన్నై సమీపంలోని వేలూ రులో కన్నుమూశారు.


వేలూరుకు చెంది న వాణిజయరామ్‌ అసలు పేరు కలైవాణి. వివాహానంతరం తన పేరులోని వాణికి భర్త పేరును చేర్చుకుని వాణీజయరామ్‌గా మార్చుకున్నారు.  ఆయన వాణిజయరామ్‌ను గాయనిగా ఎంతగానో ప్రోత్సహించారు. వివాహానంతరం వాణిజయరామ్‌ భర్తతో కలిసి కొంత కాలం ముంబయిలో మకాం పెట్టారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరామ్‌ సోమవారం తుది శ్వాస విడిచారు.ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: