ఆమె నవ్వు పండు వెన్నెల. ఆమె రూపం అసమానం. ఆమె అందం జగన్మోహనం. ఆమె పరువం పదహారు ప్రాయం. ఇవన్నీ ఎవరికి సరిపోతాయి. వెండి తెర వేలుపు  ఒక్క శ్రీదేవికి తప్ప. సిరి మల్లె పూవు లాంటి శ్రీదేవి అలా కనిపించిందంటే చాలు కనకాభిషేకాలే. ఆమె అభినయంతో ఆంతా లీనమైపోయేవారే. అందుకే శ్రీదేవి ఎప్పటికీ శ్రీదేవే. 



ఆమెలా మరొకరిని కలలో కూడా ఊహించుకోలేము. ఆమె అన్నది ఒక్కరే. ఆమెను ఆ బ్రహ్మదేముడు అత్యంత శ్రద్దగా  చేసి మరీ ఇలకు పంపించాడ‌ని జనాల నమ్మకం. ఆమె దేవలోకం అప్సరస. ఏదో పొరపాటున శాపవ‌శాత్తు  ఇలకు దిగి వచ్చి కొన్నాళ్ళపాటు తన అందంతో అందరినీ మత్తెక్కించి, మైమరపించి మళ్ళీ తన లోకాలకు తిరిగి వెళ్ళిపోయారని అంతా నమ్ముతారు.


 
ఆమెలా  ఉన్నారని ఎవరైనా అన్నా అభిమాన జనం అసలు ఒప్పుకోరు. ఎందుకంటే శ్రీదేవి ద ఓన్లీ వన్ అంతే అంటారు. ఈ కధంతా ఎందుకంటే ఇపుడు అన్నగారి బయోపిక్ తీస్తున్నారు. అందులో  అన్న నందమూరి పక్కన చిందులేసే భామగా  శ్రీదేవి ఉండాలిగా. ఇద్దరివీ కలిపి ఏకంగా డజన్ కి పైగా సినిమాలు ఉన్నాయిగా. అసలు వారిది అతి పెద్ద హిట్ పెయిర్  అనేవారు ఆ రోజుల్లో మరి.



అటువంటి శ్రీదేవిని మళ్ళీ వెండి తెరపై సాక్షాత్కరింపచేయడం వశమేనా,  అదసలు సాధ్యమా. అంటే సాధ్యమే అంటున్నారు. దర్శకుడు క్రిష్. ఆయన ఈ మూవీలో శ్రీదేవి పాత్ర కోసం యువ తార రకుల్ ప్రీతీ సింగ్ ని తీసుకున్నారు. ఆమె పొడవు వరకు శ్రీదేవిని  సరిపోలి ఉండవచ్చు. కానీ అందమైన శ్రీదేవిని అచ్చం అలా దింపేయడం మళ్ళీ ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదని అంటున్నారు. కానీ తాను అపర బ్రహ్మ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న క్రిష్ చేసి చూపిస్తానంటున్నారు.



ఇప్పటికే సుమంత్ పాత్ర ధారిని  అక్కినేని వారిగా దించేసిన క్రిష్ ఇపుడు శ్రేదేవిని కూడా ఔరా అనిపించేలా అతిలోక సుందరిగా తీసుకువస్తానని చెబుతున్నారు. అది నిజమేనని కూడా అనిపిస్తోంది. ఇక్కడ శ్రీదేవి   కంటే క్రిష్ మీద నమ్మకమే అలా అనిపించేలా చేస్తోంది. రకుల్ ని కనుక శ్రీదేవిగా చూపిస్తే మాత్రం ఆ మానియా వేరేలా ఉండదు. ఓ రేంజిలో   ఊపు ఊపేయదూ..



మరింత సమాచారం తెలుసుకోండి: