సినిమాల్లో హీరోలతో స్టెప్పులేస్తూ ఆడీ పాడే హీరోయిన్లు మొత్తం యూనిట్ ని అంతా ఆటాడించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఆడవారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటారు. అందుకు ఉదాహరణగా చిత్ర సీమలో ఎందరో మహిళా దర్శకులు కూడా వచ్చారు. అలాగే సక్సెస్ కూడా సాధించారు. వారి బాటలోనే ఇపుడు మరో యువ నాయిక మెగా ఫోన్ పడతాను అంటోంది. ఈ చిన్నదాని అనుభవం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే. అయితే ఆమె చూపు మాత్రం దర్శకత్వం వైపు మళ్ళిందంట.


ప్రేమం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుపమా పరమేశ్వరన్ ఆ తరువాత తెలుగులో మంచి సినిమాలే చేసి గుర్తింపు తెచ్చుకుంది. శతమానం భవతి మూవీలో ఆమె చక్కని పాత్ర పోషించింది. ఇక  యువ హీరో రామ్ తో  రెండు సినిమాలు చేసిన ఆమె లేటెస్ట్ గా హలో గురూ ప్రేమ కోసమే మూవీలో మెరిసింది. ఈ ముద్దు గుమ్మ తొందరలోనే మెగా ఫోన్ పట్టాలని తహతహ‌లాడుతోందట. 


ఆమెకు మణి రత్నం టేకింగ్ అంటే చాల ఇష్టమట. మణి సార్ సినిమాలో ప్రతీ ఫ్రేం ఓ అద్భుతం అంటూ ముచ్చట పడుతున్న ఈ అందాల బొమ్మ ఎప్పటికైన తానూ దర్శకురాలిగా మారి మంచి మూవీ తీస్తానని చెబుతున్నారు. తనకు తెలుగులో త్రివిక్రం లాంటి డైరెక్టర్లు ఇష్టమని చెబుతున్న ఈ బొమ్మ వారి నుంచి కూడా సలహా సూచనలు తీసుకుంటాను అంటోంది. 


మొత్తానికి ఇపుడున్న జనరేషన్లో హాపీగా అడుతూ పాడుతూ నాలుగు డబ్బులు వెనకేసుకునే హీరోయిన్లనే చూశాం, కానీ మంచి టేస్ట్ తో సినిమాలు తీస్తాను అనే అనుపమ లాంటి అమ్మాయిలను ఇపుడే చూస్తున్నాం. ఎంతైనా ఆశయం మంచిది. ఆ దిశగా అనుపమ ముందుకు సాగి సూపర్ సక్సెస్ కావాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: