లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా అరంగేట్రం చేసిన దగ్గుబాటి నటవరసుడు రానా, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రానా, సీఎంగా నటించి అందరిని మెప్పించారు. ఇక ఆ తరువాత ఆయన హీరోగా చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ తరువాత అనూహ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో రానాకు అవకాశం రావడం, అలానే ఆ సినిమాలో ఆయన చేసిన భల్లాలదేవుడి పాత్రలో ఆయన నటనకు దేశవ్యాప్తంగా మంచి పేరు రావడం జరిగిపోయాయి.

ఇక ఆ తరువాత రానా నేషనల్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం హాథి మేరా సాథితో పాటు మరొక రెండు సినిమాల్లో నటిస్తున్న రానా, ఆ తరువాత ఇటీవల నీది నాది ఒకటే కథ సినిమాతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న దర్శకుడు వేణు అడుగుల దర్శకత్వంలో తదుపరి సినిమాని చేయడానికి రానా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు విరాటపర్వం 1992 అనే టైటిల్ అనుకుంటున్నారట. దానికి కారణం, ఈ సినిమా ఎక్కువగా రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని, అలానే వార్డు మెంబెర్ గా రానా ఈ సినిమాలో నటిస్తున్నాడని అంటున్నారు.

అంతేకాక ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా ఈ సినిమా రూపొందనుందట. ఇప్పటికే లీడర్, ఆ తరువాత ఇటీవలి తేజ దర్శకత్వంలో వచ్చిన నేనేరాజు నెనేమంత్రి సినిమాల్లో రాజకీయనాయకుడిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై, కలెక్షన్ల పరంగా నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా కెరీర్లో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది.  ఇక ఆ రెండు సినిమాల తరువాత ఇప్పుడు వేణు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో రానా ముచ్చటగా మూడోసారి ఖద్దరు ధరిస్తున్నాడన్నమాట.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కానుందని, అలానే సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుందని సమాచారం. అయితే ఇందులో ఒక గమ్మత్తయిన విషయం ఏంటంటే, ఓవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగి, అందరూ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో రానా ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించడం కొంత చర్చకు తావిస్తోందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: