130 కోట్లకు పైగా ఉన్న అఖండ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే యోగం అందరికీ రాదు. దీనికి అదృష్టంతో పాటు అనేక అర్హతలు ఉండాలి. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ తన వ్యక్తిగత అలవాట్ల గురించి తన అభిరుచుల గురించి ఎవరికీ తెలియని చాల ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. 

చిన్ననాటి రోజులలో తన జీవితం అంతా పేదరికంలో గడిపిన నేపధ్యంలో అప్పట్లో తన మేనమామ తనకు కొని ఇచ్చిన తెల్లని బూట్లు తరుచు మురికి పట్టి పోతూ ఉంటే తాను చదివే స్కూల్ లో క్లాస్ రూమ్ లో వాడి పడేసిన చాక్ పీస్ ముక్కలను పెట్టి తన బూట్లకు పాలిష్ చేసుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇక తనకు చిన్నప్పటి నుండి మామిడి పండ్లు తినడం అంటే ఎంతో ఇష్టం అనీ అయితే అప్పట్లో వాటిని కొనుక్కునే ఆర్ధిక స్థితి లేక తాను ఉండే ఊరు చివరిలో ఉన్న మామిడి తోటలకు వెళ్ళి అక్కడ పండ్లను కోసుకుని తినేవాడిని అన్న ఆసక్తికర విషయాన్ని అక్షయ్ కుమార్ కు షేర్ చేసాడు. 

తాను మొదట్లో సన్యాసం తీసుకుందామని ఆలోచించాననీ ఆతరువాత సైన్యంలో చేరాలని అనుకున్నాననీ అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పుడు తాను ప్రధానమంత్రి అవుతానని కలలో కూడ అనుకోలేదు అని అభిప్రాయ పడ్డాడు మోదీ. అదేవిధంగా తాను జీవితంలో తన అమ్మకు కాని తన కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదనీ అయితే వాళ్ళంటే తనకు ప్రేమ ఉన్నా వారెప్పుడు తన నుంచి ఎటువంటి సహాయం ఆశించలేదు అంటూ తన కుటుంబ నేపద్యం గురించి వివరించారు. 

ఇక తన ఆరోగ్యం గురించి వివరిస్తూ తనకు అనారోగ్యం వచ్చినా మందులు వేసుకోననీ మందులు వేసుకోవడం తనకు పెద్దగా ఇష్టం లేదు అని అంటూ మందులకు బదులు శరీరానికి మర్దన వంటి సాంప్రదాయ పద్దతులు ద్వారా తనకు ఇష్టం అని వివరించారు. ఇదే సందర్భంలో మరొకఆశ్చర్యకర విషయం వివరిస్తూ ప్రతిరోజు మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతానని తన అలవాటు తెలుసుకుని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడ షాక్ అయిన విషయాన్ని వివరిస్తూ తన శరీరం తక్కువ నిద్రకు అలవాటు పడిన సందర్బాన్ని వివరించాడు. ఇక తన పై ఎవరైనా విమర్శలు చేస్తే తనకు మరింత పట్టుదల పెరిగిపోతుందనీ విమర్శలు చేసే వారి పై అసహనంతో రగిలిపోయేకన్నా మన లక్ష్యాన్ని  చేరుకోవడానికి సహకారంగా ఆ విమర్శలను భావించాలి అంటూ బాధ్యతలు లేని జీవితం ఉండదు అంటూ అందరికీ కుటుంబ బాధ్యతలు ప్రధానం అయితే తనకు దేశ ప్రజల భవిష్యత్ ప్రధాన బాధ్యత అంటూ తన జీవిత లక్ష్యాన్ని వివరించారు మోడీ..   



మరింత సమాచారం తెలుసుకోండి: