నాగబాబు ఎన్నికల చివరి రెండు వారాల ముందు రాజకీయాల్లోకి వచ్చి నేనేంటో చూపిస్తానని ప్రగల్బాలు పలికాడు. మొన్నటివరకు జబర్దస్త్ లో ఉండి ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తే ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి. స్టార్ట్, కెమెరా, యాక్షన్.. ఈ పదాలకు అలవాటైన వాళ్లు ఓ పట్టాన దాన్ని వదిలి రాలేరు. అయితే కవరింగ్ చేసుకోవడంలో మాత్రం మెగా ఫ్యామిలీని ఎవరూ బీట్ చేయలేరు. జబర్దస్త్ టీవీ ప్రోగ్రామ్ తో క్రేజ్ అండ్ క్యాష్ సంపాదించుకున్న నాగబాబు ఆ ప్రోగ్రామ్ ని ఎందుకు వదులుకుంటారు చెప్పండి, అది కూడా రాజకీయాల కోసం.


అవకాశాలు లేవు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటానంటున్నాడు కానీ, జబర్దస్త్ ని మాత్రం వదిలేది లేదని మరోసారి చెప్పాడు నాగబాబు. దీనికి ఓ అందమైన కథ కూడా అల్లాడు. ఏపీ ఎన్నికల రోజు నాగబాబు ఓటు వేయడానికి వెళ్తే అక్కడ ఓ పెద్దావిడ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు కదా జబర్దస్త్ మానేస్తావేమో మేము ఊరుకోం.. నువ్వే దానికి జడ్జిగా ఉండాలని చెప్పిందట. అది విన్న నాగబాబు జబర్దస్త్ షోకి తానెంత అవసరమో గ్రహించాడట. ప్రజల్ని నవ్వించే ఇలాంటి ప్రోగ్రామ్ ని మిస్ చేయకూడదు అని అప్పుడే డిసైడ్ అయ్యాడట. ఇది కూడా ఓ సామాజిక బాధ్యతే అంటున్నాడు నాగబాబు.


అంతా బాగానే ఉంది కానీ, నాగబాబు జబర్దస్త్ ప్రోగ్రామ్ ని ఉచితంగా చేయడం లేదు కదా? ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో మంచి మంచి అడ్వర్టైజ్ మెంట్ లు కూడా బాదేస్తున్నాడు. వ్యాపారం బాగుంది కాబట్టే బుల్లితెరని మెగా బ్రదర్ వదిలిపెట్టడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినా కూడా వ్యాపారం వ్యాపారమే. అంతెందుకు ప్రజా సేవ, ప్రజలే జీవితం అంటూ ఇలా వచ్చి అలా పార్టీని తాకట్టు పెట్టి, కేంద్రమంత్రి పదవి చేపట్టి బుగ్గకారు వైభవం అనుభవించి తిరిగి ఇప్పుడు మొహానికి రంగులేసుకుంటున్న చిరంజీవిని చూడలేదా. చిరంజీవి కంటే నాగబాబు గొప్పోడా?  మానేస్తే.. టీవీ, సినిమాలు రెండూ మానేసి ప్రజా క్షేత్రంలోనే ఉండి తాడోపేడో తేల్చుకోవాలి. అయితే నాగబాబుకి శ్రమ లేకుండా పూర్తిస్థాయిలో జబర్దస్త్ షో చేసుకునేలా ఏర్పాటు చేశారు నర్సాపురం ప్రజలు. మే 23 తర్వాత ఎలాగూ నాగబాబుకి ఈ విషయం అర్థమౌవుతుందనుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: