ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి మరణంతో సినీ ప్రముఖులు విషాదంలో కూరుకుపోయారు.  తెలుగు, తమిళ భాషల్లో ఆయన సుమారు 800 సినిమాల్లో నటించారు.  ఎన్నో వేల నాటకాలు ఆడిన ఆయన ‘స్త్రీ’సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు.  చిరంజీవి నటించిన ‘కుక్కకాటుకి చెప్పదెబ్బ’సినిమాతో నటుడిగా తానోంటూ ప్రూవ్ చేసుకున్నారు.  విలన్, కామెడీ, క్యారెక్టర్ ఎలాంటి పాత్రలైనా సునాయసంగా నటించేవారు. 


రాళ్లపల్లితో చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి అనుబంధం పెనవేసుకుపోయింది.  ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న కోట శ్రీనివాసరావు కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. రాళ్లపల్లితో తనది 40 ఏళ్ల అనుబంధం అని, ఇద్దరి మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని వెల్లడించారు. ఆయన రాసిన మళ్లీ పాత పాటే నాటకంలో తాను కూడా నటించానని, ఆ నాటకంతో ఎంతో పేరొచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఒక మంచి మిత్రుడు మన మధ్య లేడంటే నమ్మలేకపోతున్నానని కోట విచారం వ్యక్తం చేశారు.


ప్రముఖ నటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ..ఇతరులకు సాయం చేయడంలో రాళ్లపల్లి గారి తర్వాతే ఎవరైనా అని భరణి అభిప్రాయపడ్డారు. ఎంతగా అంటే ఆయనకు అదో వ్యసనంలా ఉండేది...కష్టం వచ్చిందని ఏ చిన్న కళాకారుడు వెళ్లినా..తన వంతు సహాయం అందించేవారు.  చాలామంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకునేవాళ్లని, అలాంటివాళ్లను తాను తిట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. 


అయితే, కిళ్లీ తెచ్చుకోవడానికి వెళుతున్నాన్రా అని చెప్పి బయటికెళ్లి వాళ్లకు డబ్బులు ఇచ్చేవాడని తనికెళ్ల భరణి వివరించారు. ఎలాంటి సాయం కోరి వచ్చినా కాదనకుండా చేసేవారని పేర్కొన్నారు. రాళ్లపల్లి గారు ఎంతో పెద్ద మనసుతో సొంత కొడుకులా ఆదరించాడని గుర్తుచేసుకున్నారు. "అప్పట్లో డబ్బు అడగడానికి మొహమాట పడతానని చెప్పి, నేను నిద్రలేవకముందే ఆయన నా ప్యాంట్ జేబులో రూ.100 నోటు పెట్టేసి ఏమీ తెలియనట్టే బయటికి వెళ్లిపోయేవారు అని భరణి వెల్లడించారు. అలాంటి గొప్ప మనిషి మన మద్య లేక పోవడం దురదృష్టం అని అన్నారు.


ఇక ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ..రంజాన్ నెల ఉపవాసం ముగించుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లి రాళ్లపల్లి గారిని చూసొద్దాం అని బయల్దేరి వెళితే అక్కడ ఆయన భౌతికకాయం కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలుగు చిత్రపరిశ్రమ చెన్నైలో ఉన్న సమయంలో షూటింగ్ ప్యాకప్ చెప్పగానే, పేద ఆర్టిస్టులు ఎవరైనా సెట్స్ మీద ఉంటే వాళ్ల జేబులో ఎంతో కొంత డబ్బు పెట్టి పంపించేవారని గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల క్రితం కూడా  కాకినాడలో సీనియర్ గాయకుడు బాబ్జీ తీవ్ర కష్టాల్లో ఉన్నాడని తెలిసి రాళ్లపల్లి చలించిపోయారని, వెంటనే తనవంతుగా సాయం చేశారని వివరించారు. నువ్వూ ఎంతోకొంత ఇవ్వు, మరో నలుగురికి చెప్పి సాయం చేయించు అంటూ తనతో చెప్పారని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: