ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో కనీసం ఒక సంవత్సర కాలం మౌనం రాజ్యమేలుతుంది. జగన్మోహన్ రెడ్డి విధానాలు పదకాలు పై ప్రజల స్పందన తెలియాలి అంటే కనీసం ఒక ఏడాది పాటు వేచి చూడాలి. దీనితో ఆంద్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు అన్నింటికీ ఇప్పుడు హాలీడే పిరియడ్.

ఇలాంటి పరిస్థుతులలో పవన్ కళ్యాణ్ తన రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించి సినిమాలు చేస్తాడనీ అతడి అభిమానులు భావించారు. అయితే పవన్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్నికల ముందు ప్రజాపోరాట యాత్ర చేసిన పవన్ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మరో యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు టాక్.

అయితే ఈ యాత్ర ‘జనసేన’ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులకు ‘జనసేన’ కోసం కష్టపడి శ్రమించి ఇప్పుడు నిరుత్సాహ పడుతున్న క్యాడర్ కు ధైర్యం చెప్పడానికి పవన్ ఈ ఓదార్పు యాత్ర చేయబోతున్నట్లు టాక్. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో పవన్ చేయబోయే ఓదార్పు యాత్రకు ‘జనసేన పరామర్శ యాత్ర’ అని పేరు పెడతారా అంటూ జోక్ చేస్తున్నారు. 

అయితే పార్టీని నిలబెట్టాలి అని భావించే నాయకుడు తాను నిరుత్సాహ పడకుండా తన కార్యకర్తలకు ధైర్యం కలిగిస్తూ రాబోయే ఎన్నికలలో గెలుపు మనదే అన్న స్ఫూర్తి కలిగించినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు నిలబడ గలుగుతాయి. అయితే గ్రామ స్థాయిలో ఏమాత్రం పట్టులేని ‘జనసేన’ ను ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు సంబంధించిన్ ప్రతి ఊరులోను ‘జనసేన’ జెండా ఎగిరేలా చేయాలి అంటే చాల ఓర్పు నేర్పు కావాలి. స్వతహాగా ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తింప గలిగితే వచ్చే ఎన్నికల వరకు ‘జనసేన’ మనుగడకు ఎటువంటి ప్రమాదం ఉండదు అన్నది విశ్లేషకుల భావన..


మరింత సమాచారం తెలుసుకోండి: