హాలీవుడ్ లో టాప్ స్టార్స్ కు పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి. కొత్త కొత్త భవనాలను కొనుగోలు చేసి... ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు.  ఇదిలా ఉంటె, హాలీవుడ్ స్టార్స్, మాజీ భార్య భర్తలు బ్రాడ్ పిట్, జెన్నిఫర్  ఒకప్పుడు నివాసం ఉన్న ఇంటిని తాజాగా అమ్మకానికి పెట్టారు. 


2001లో వీరు కలిసి ఉన్న సమయంలో కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో 13.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇపుడు దాన్ని 49 మిలియన్ డాలర్లుకు అమ్మకానికి పెట్టారు. 1934లో నిర్మించిన ఈ ఇంటిలో టెన్నిస్ కోర్టు, ఇతర అత్యాధునిక నిర్మాణాలు ఉన్నాయట.  


ఈ ఇంట్లో  మొత్తం 4 బెడ్రూంలు, 12 బాత్రూంలు, దాదాపు 20 మంది ఒకేసారి కూర్చుని తినగలిగే విశాలమైన డైనింగ్ హాల్, బార్ రూమ్, ప్రైవేట్ ఎక్సర్‌సైజ్ రూమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు సమాచారం.  ఇదిలా ఉంటె, బ్రాడ్ పిట్, జెన్నిఫర్ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 


ఐదేళ్ల కాపురం తర్వాత వీరు విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రాడ్ పిట్ ఏంజెలీనా జోలీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం బ్రాడ్ పిట్, జెన్నిఫర్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ మధ్య జెన్నిఫర్ 50వ పుట్టినరోజు వేడుకకు కూడా బ్రాడ్ పిట్ హాజరయ్యారు.


జెన్నిఫర్ 2015లో జెస్టిన్ థ్రాక్స్‌ను పెళ్లాడి 2018లో ఈ ఇద్దరూ విడిపోయారు. జెన్నిఫర్ 50వ పుట్టినరోజు వేడుకకు బ్రాడ్ పిట్ రావడంతో ఇద్దరూ మళ్లీ కలుస్తారని అభిమానులు భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. మరో వైపు బ్రాడ్ పిట్ సైతం ఏంజెలీనా జోలీతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రాడ్ పిట్ ఒంటరిగా ఉంటున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: