ప్రముఖ బహుభాషా నటుడు, నాటక సాహిత్యంలో లెజండ్‌గా పేరుగాంచిన గొప్ప రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ శ్రీ గిరీష్ కర్నాడ్ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో  అశేష సినీ, సాహితీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.  గిరిష్ కర్నాడ్ మరణం పట్ల ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్‌లు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

గిరీష్ కర్నాడ్ మహారాష్ట్రలోని మాథెరన్‌లో 1938 మే 19న జన్మించారు. గిరీష్ తల్లి కృష్ణబాయి చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఆమెకు అప్పటికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. నర్స్ అయిన కృష్ణబాయిని డాక్టర్ రఘునాథ్ కర్నాడ్ వివాహం చేసుకున్నారు. ఆ తరవాత జన్మించిన నలుగురు సంతానంలో గిరీష్ కర్నాడ్ ఒకరు. కర్ణాటక వర్సిటీ, ధర్వాడ్ ఆర్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన గిరీష్ కర్నాడ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మాగ్దలెన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పట్టా సాధించారు. 


నాటక రచయితగా గిరీష్ కర్నాడ్ ప్రస్థానం :
కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉన్న గిరిష్ కర్నాడ్‌కు నాటకాలపై ఉన్న ఆసక్తి ఆయనను ఆ రంగం దిశగా అడుగులు వేయించింది. 1961 లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పీజీ చేస్తున్న రోజుల్లోనే  "యయాతి"  పేరుతో కన్నడ భాషలో తొలి నాటకాన్ని రచించారు. తర్వాత దాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు.  యయాతి మంచి పేరు తీసుకురావడంతో ఆయన నాటక రచనపై మరింత శ్రద్ధ పెట్టారు. ఆ తర్వాత 1964లో గిరిష్ కర్నాడ్ రచించిన "తుగ్లక్" నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది.

ఆయన రచించిన నాటకాల్లో  'యయాతిట, 'తుగ్లక్', 'హయవదన్', 'అంజు మల్లిగె', 'అగ్నిమతు మాలె' 'నాగమండల్' చాలా ప్రముఖమైనవి. నాటక రచనలో గిరీష్ కర్నాడ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయన్ని గౌరవించింది. అలాగే ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు కూడా దక్కింది. దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు 1998లో  జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న ఏకైక నాటక సాహిత్యవేత్త గౌరవం కేవలం గిరీష్ కర్నాడ్‌కే దక్కడం విశేషం.  అంతేకాదు  జ్ఞానపీఠ పురస్కారంపొందిన ఇద్దరు కన్నడ కవుల కావ్యాలను చలనచిత్రాలుగా వెండితెరకెక్కించిన కీర్తి కూడా గిరీష్ కర్నాడ్ సొంతం. 


నటుడిగా గిరీష్ కర్నాడ్ ప్రస్థానం:
నాటక రచయితగా  పేరుగాంచిన గిరీష్ కర్నాడ్ 1970లో నటుడిగా కన్నడ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కర్నాడ్ నటించిన తొలి కన్నడ చిత్రం..సంస్కార.  కన్నడలో తొలిసారిగా కళాత్మకంగా తీసిన  సినిమా.. సంస్కార. ఇందులో కర్నాడ్ ప్రాణేశాచార్య‌ పాత్రకు జీవం పోశారు. సంస్కార చిత్రం స్వర్ణకమలం పొందిన తొలి కన్నడచిత్రంగా కన్నడ సినీ చరిత్రలో నిలిచిపోయింది.. తరువాత 1971 లో  బి.వి. కారంత్ అనే ప్రసిద్ధ దర్శకునితో కలసి సహదర్శకత్వంలో ఎస్.ఎల్.భైరప్ప వ్రాసిన వంశవృక్ష కావ్యం ఆధారంగా ఆదే పేరుతో ఒక చిత్రాన్ని తీసారు. ఈ 'వంశ వృక్ష'  చిత్రానికి గాను  బి.వి. వీ.కారంత్ తో కలిపి గిరీష్ కర్నాడ్‌‌కు ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు‌ దక్కింది.

ఆ తర్వాత కన్నడలో తబ్బిలు నీనాదె మగనె , కాడు , ఒందానొందుకాలదల్లి  చిత్రాలకు గిరిష్ కర్నాడ్  దర్శకత్వం వహించారు. కాడు చిత్రానికి కూడా చాలా పురస్కారాలు, ప్రశంసలు అందాయి. అటు పిమ్మట ఉత్సవ , గోధూళి అనే హింది చిత్రాలకు దర్శకబాధ్యతలు నిర్వహించారు.  ఆ తర్వాత "కనక పురందర" , "ద.రా.బెంద్ర , సూఫి పంథ అనే డాక్యుమెంటరీ చిత్రాలకు గిరిష్ కర్నాడ్ డైరెక్షన్ వహించారు. పరిసరవినాశనం గురించి తెలియచేసె "జెలువి అనేచిత్రానికి కూడా దర్శకుడిగా గిరీష్ కర్నాడ్ పనిచేసారు. అలాగే అగ్నిశ్రీధర్‌తో కలిసి "ఆ దినగళు" అనే మూవీకి చిత్రకథను అందించారు. ఇక నటుడిగా బుల్లితెరపై అడుగు పెట్టిన గిరిష్ కర్నాడ్ ప్రముఖ రచయిత ఆర్‌కే నారాయణ్ పుస్తకం ఆధారంగా వచ్చిన 'మాల్గుడి డేస్' సీరియల్‌లో ఆయన స్వామికి తండ్రి పాత్ర చేశారు. ఇక 1990లో మొదలైన సైన్స్ ఆధారిత టీవీ కార్యక్రమం 'టర్నింగ్ పాయింట్‌'ను హోస్ట్‌ చేశారు. ఆయన ఆఖరి సినిమా కన్నడ భాషలోనే నిర్మించిన అప్నా దేశ్.  
 
గిరిష్ కర్నాడ్ నటించిన తెలుగు సినిమాలు :
 
ఆర్ట్ సినిమాల్లోనే కాకుండా గిరీష్ కర్నాడ్ కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించారు. కన్నడ సినీరంగానికే పరిమితం కాకుండా హిందీతో పాటు పలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. రక్షకుడు, ప్రేమికుడు, ధర్మచక్రం, ఆనందభైరవి చిత్రాల్లోఆయన తన నటనాకౌశల్యాన్ని చాటుకున్నారు.  ప్రేమికుడు సినిమాలో నగ్మా తండ్రిగా విలన్‌గా  చెలరేగిపోయి నటించిన గిరీష్ కర్నాడ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక  శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రంలో  మెగా స్టార్ చిరంజీవి తండ్రిగా గిరీష్ కర్నాడ్ చూపించిన అభినయాన్ని తెలుగు ప్రజలు ఎప్పటీకీ మర్చిపోలేరు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొమరం‌పులి తెలుగులో ఆయనకు ఆఖరి చిత్రం. ఇక బాలీవుడ్‌లో ఆయన నటించిన ఆఖరి చిత్రం 2017లో సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ జిందా హై  మూవీ.


అవార్డులు : 
ప్రముఖ నాటక రయితగా గిరీష్‌కర్నాడ్ ప్రతిభాపాటవాలకు ఎన్నో అవార్డులు, సాహితీ పురస్కారాలు దక్కాయి
- 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు
 - 1974లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు
-  1992లో పద్మ భూషణ్ అవార్డు 
-  1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం
-  1994లో సాహిత్య అకాడమీ పురస్కారం
-  1998లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం
-  1998లో కాళిదాసు సమ్మాన్ అవార్డు 
ప్రజా ఉద్యమాల వారథి - గిరీష్ కర్నాడ్

ప్రముఖ నాటకరచయితగా, విలక్షణ నటుడిగా పేరుగాంచిన గిరీష్ కర్నాడ్‌లో మరో కోణం ఉంది.  సామాజిక ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక, లౌకికవాదిగా గిరీష్ కర్నాడ్ హిందూత్వం పేరుతో కొందరు చేస్తున్న వికృత చేష్టలను తీవ్రంగా నిరసించారు.  ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. అర్బన్ నక్సల్స్ అనే కాన్సెప్ట్ మీద విమర్శలు చేసిన వారిలో గిరీష్ కూడా ముందు వరుసలో ఉంటారు. నేనూ అర్బన్ నక్సల్ నే అని మెడలో కార్డ్ వేసుకుని తన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల దమననీతిని, రాజ్యహింసను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గౌరీలంకేష్ హత్య సందర్భంగా హిందూ అతివాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న పేర్లలో గిరీష్ కర్నాడ్ పేరు కూడా ఉంది. అయినా ఎటువంటి బెదిరింపులకు వెరువక హిందూత్వ అతివాదంపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు. 


ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత గిరీష్‌ కర్నాడ్‌  సోమవారం ఉదయం బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, జర్నలిస్టు, రచయిత అయిన కొడుకు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. గిరీష్ కర్నాడ్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ ఆత్మకు శాంతి కలగాలని ఏపీ హెరాల్డ్ ప్రార్థిస్తోంది. ఆయన మరణం సాహితీ, సినీ రంగాలకే కాదు..ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.ఆయనో గొప్ప నాటక రచయిత , దర్శకుడు మాత్రమే కాదు అంతకు మించి గొప్ప ప్రజాస్వామ్యికవాది, లౌకికవాది, ప్రజా ఉద్యమాల వారథి...జోహార్ గిరీష్ కర్నాడ్..!


మరింత సమాచారం తెలుసుకోండి: