మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓటర్’. విష్ణుకు, ఈ చిత్ర దర్శకుడు జి.ఎస్.కార్తీక్ రెడ్డికి మధ్య వివాదం తలెత్తడంతో ‘ఓటర్’ వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కథ మోహన్ బాబు ‘అసెంబ్లీ రౌడీ’ని పోలి ఉందని, కాబట్టి స్టోరీ హక్కుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలని విష్ణు వేధిస్తున్నట్టు కార్తీక్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధంలేదని నిర్మాత జాన్ సుధీర్ పూదోట చేతులు దులుపుకున్నారు. మరోవైపు, విష్ణుపై కార్తీక్ బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేయడంతో సినిమా విడుదల ఇక అసాధ్యమే అనుకున్నారంతా. కానీ, విడుదల తేదీని ప్రకటించి నిర్మాత అందరినీ ఆశ్చర్యపరిచారు. 


అయితే, ఈ చిత్రాన్ని నిర్మాత జాన్ సుధీర్ పూదోట నేరుగా విడుదల చేయడం లేదు. సినిమా విడుదల హక్కులను సార్థక్ మూవీస్‌కు విక్రయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థే ఈనెల 21న ‘ఓటర్’ను విడుదల చేస్తోంది. ఈ సినిమాలో విష్ణుకు జంటగా సురభి నటించింది. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించారు. 


సినిమా విడుదల విషయమై నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ.. ‘పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే.. అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓటు హక్కు, ఓటర్‌ విలువను తెలిపే ఈ చిత్రాన్ని పొలిటికల్‌ డ్రామాగా దర్శకుడు కార్తీక్‌ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతోపాటు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్‌ మూవీస్‌ సంస్థ మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: