''నటుడిగా నన్ను ఆదరిస్తున్నారంటే అందుకు నాన్న సాయికుమార్‌ అభిమానులే కారణం. అందుకే చాలామందికి కనెక్ట్‌ అయ్యాను. నాన్నగారి వాయిస్‌, ఆహార్యం, వాగ్ధాటికి అభిమానులే కాకుండా ప్రేక్షకులుగా ఫిదా అయ్యారు. చాలామంది 'మీ నాన్నలా పోలీసు పాత్రలు చేయమని అడిగారు'. కానీ నేనెలా ఆయనలా ఆ పాత్ర చేస్తాను. అందుకు నాన్నగారే ఫేమస్‌. నేను ఆ పాత్ర చేయలేను'' అని సాయికుమార్‌ నట వారసుడు ఆది తెలియజేశారు.
'ప్రేమకావాలి', 'లవ్‌లీ' లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో నటనతో పాటు డాన్స్‌లు, ఫైట్స్‌తో అలరించి అటు క్లాస్‌ ఇటు మాస్‌ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్‌. ప్రస్తుతం బీరం సుధాకర రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్స్‌, టఫెండ్‌ స్టూడియోస్‌ లిమిటెడ్‌ బ్యానర్లపై హెచ్‌కె. శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌, కిరణ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బుర్రకథ'. ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్‌తో ఇంటర్వ్యూ. 


రెండు మెద‌ళ్ళు ఉన్న క్యారెక్టర్స్‌ చేయడం ఎలా అనిపించింది? 
సవాల్‌గా స్వీకరించాను. అదే టైములో ఏదైనా క్యారెక్టర్‌ మనకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తేనే మనలోని బెస్ట్‌ యాక్టర్‌ కూడా బయటికి వస్తాడు. చాలా మంది సీనియర్‌ యాక్టర్స్‌ ఎందుకు ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ ఎంచుకుంటారో ఇప్పుడు అర్ధం అయింది. ఇలాంటి ఒక క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడు మనం రిలాక్స్‌ అవ్వం. రెండు క్యారెక్టర్స్‌ ఆడియన్స్‌కి రిజిస్టర్‌ అవుతాయి అనే నమ్మకంతోనే నటించడం జరిగింది. ఈ కథే చాలా స్ట్రాంగ్‌ ఎలిమెంట్స్‌తో కూడుకున్నది. ఆ రెండు క్యారెక్టర్స్‌ కూడా ఆడియన్స్‌కి ముందే రిజిస్టర్‌ అవుతాయి. అది ఎలా అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి. 


దర్శకుడు పాయింట్‌ చెప్పినప్పుడు ఏమ‌నిపించింది? 
ఈ కథ చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. ఎందుకంటే ఇదివరకే నేను దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్‌ చదివాను. నాకు పర్సనల్‌గా కూడా ఇలాంటి విషయాలంటే కొంత ఆసక్తి ఉంది. అందుకనే కథ వినగానే ఓకే.. నేను చేయగలను అనే నమ్మకం వచ్చింది.


క్యారెక్టర్స్‌లో వున్న ప్రత్యేకత గురించి?

అభి, రామ్‌ అనే పాత్రలు. అభి క్యారెక్టర్‌ నేటితరం యువత ఎలా ఆలోచిస్తుందో దానికి ప్రతీకగా ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేని ఒక ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌. వాళ్ళ నాన్నతో కలిసి మందు తాగుతూ సరదాగా అమ్మాయిల వెనకాల తిరుగుతాడు. ఇక రామ్‌ క్యారెక్టర్‌కి వస్తే పూర్తి విరుద్ధం. పేరెంట్స్‌ అంటే గౌరవం ఎక్కువ. అబ్దుల్‌ కలాం, వివేకానందుడు లాంటి గొప్ప వ్యక్తి అవ్వాలనే కోరిక వున్నవాడు.

ఇంతకీ మీలో ఎవరున్నారు? 
నా వరకు నేను రామ్‌లా ఉంటాను అనుకుంటాను. కానీ చాలా మంది నన్ను అభిలా ఉంటావు అంటారు. ఇదే విషయం నేను రత్నబాబును అడిగాను. అయితే మీరు కెమెరా ముందు అభిలా ఉంటారు. కెమెరా ఆఫ్‌ చేస్తే రామ్‌లా కనిపిస్తారు అన్నారు.


దర్శకుడు కొత్తగదా ఎలా అనిపించింది? 
డైమండ్‌ రత్న బాబు నాకు కథ గురించి ఫోన్‌ చేసినప్పుడే.. 'ఐ వాంట్‌ టు డైరెక్ట్‌' అని మెసేజ్‌ పంపారు. ఒక రైటర్‌ తన కథ మీద ఎంత నమ్మకం ఉంటే నేనే డైరెక్ట్‌ చేస్తాను అని చెప్తాడు. అది కాకుండా ఇంత కాంప్లికేటెడ్‌ స్టోరీని చాలా ఈజీగా నేరేట్‌ చేశారు. అప్పుడే నేను అనుకున్న ఈ సినిమాకు రత్నాబాబు పర్ఫెక్ట్‌ అని. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మంచి టీంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఆకట్టుకునే డైలాగ్స్‌ ఆడియన్స్‌కి ఫ్రెష్‌ఫీల్‌ని తీసుకు వస్తాయి. ఆయన అంకితభావం నచ్చి మరోసారి కలిసి నటించాలనిపించింది. 


హీరోయిన్ పాత్ర గురించి?
మిస్తీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసింది. రెండు క్యారెక్టర్స్‌ మధ్య కన్‌ఫ్యుజ్‌ అయ్యే అమ్మాయి. గ్లామరస్‌గా ఉంటూనే నటనకి మంచి అవకాశం ఉండే క్యారెక్టర్‌.  అలాగే మరో హీరోయిన్‌గా నైరాశ కూడా ప్రేక్షకులని అలరిస్తుంది.


సాంగ్స్ పై స్పంద‌న‌?
ఇప్పటికే విడుదల చేసిన 'ఒకటే ఒకటే' సాంగ్‌కి, అలాగే రీసెంట్‌గా విడుదల చేసిన 'నాకొద్దు' సాంగ్‌కి ఆడియన్స్‌ నుండి ఊహించని ఆదరణ వస్తోంది. సాయి కార్తీక్‌ మ్యూజిక్‌ గురించి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతమైన సంగీతంతో పాటు చక్కటి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. 


పృథ్వితో మరోసారి స్పూఫ్‌ చేయించారు? 
దాని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను. కానీ ఈ సినిమాలో చాలాకాలం తర్వాత పృధ్వీ ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌ క్యారెక్టర్‌ చేశారు. ఆయన కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. 


ఈమధ్యకాలంలో హీరోలు మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తున్నారు. ?
నాకు ఇప్పటివరకూ అలాంటి కథలు రాలేదు. కథ బాగుంటే మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. 


కథల ఎంపికలో నిర్ణయంలో ఏమైనా మార్పులొచ్చాయా? 
నాకిప్పటికీ 'ప్రేమకావాలి', 'లవ్‌లీ' సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వాటి స్థాయిలో గుర్తింపు వచ్చే కథ కోసం వెయిట్‌ చేశాను. నా దగ్గరకి వచ్చిన కొన్ని స్క్రిప్ట్‌లు విజయవంతం అయ్యాయి. అలాగే కొన్ని అంతగా కనెక్ట్‌ కాలేదు. కథను జడ్జ్‌ చేయడంలో ఎలాంటి మార్పు లేదు. 


ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ ఎలా ఉండబోతుంది? 
సాయి కిరణ్‌ అడివి దర్శకత్వంలో అర్జున్‌ పండిట్‌ అనే కశ్మీర్‌ పండిట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఈ కథ వినగానే చాలా ఆసక్తిగా అన్పించింది. నిజ సంఘటనతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతి భారతీయుడు గర్వించే విధంగా పవర్‌ఫుల్‌ ఇంటెన్స్‌ ఉన్న దేశభక్తితో కూడిన చిత్రం. షూటింగ్‌ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది.


మీ తదుపరి చిత్రాల గురించి? 
తెలుగు, తమిళ్‌ బైలింగ్వల్‌ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. యాభై శాతం పూర్తయింది. ఈ చిత్రానికి కార్తీక్‌, విఘ్నేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్యూర్‌ లవ్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. సబ్జెక్ట్‌ లాక్‌ చేశాం. ఈ సంవత్సరంలో నేను నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: