టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కువగా తమ పార్టీ కార్యకలాపాలతో బిజీ బిజీగానే ఉంటారు. అయితే మధ్యలో ఆయన తనకు తెలిసిన వారి ఇంట శుభ, అశుభ కార్యాలు ఉంటె వాటికి కూడా తప్పకుండా హాజరవుతూ ఉంటారు. ఇక ఇదివరకు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కూడా చంద్రబాబు అటువంటి కార్యాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారని టిడిపి శ్రేణులు అంటున్నాయి. 

ఇక ఇటీవల అకాల మరణం పొందిన నటి, దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల గారి మృతి పట్ల చింతిస్తూ, నేడు చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు సూపర్ స్టార్ కృష్ణ, నరేష్, మహేష్ బాబు గార్లను కలిసి తమ సంతాపాన్ని తెలియచేయడం జరిగింది. తెలుగు సినిమాకు విజయ నిర్మల గారు ఎన్నో విశేష సేవలు అందించారని, అంతటి గొప్ప మహానటిని కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరమని చంద్రబాబు కృష్ణ గారి వద్ద ప్రస్తావిస్తూ చెప్పారట. అంతేకాక ఒక మహిళా దర్శకురాలిగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డు సాధించడం మాములు విషయం కాదని, అలానే కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఎప్పుడు కలిసినా తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని అప్పటి రోజులను అయన గుర్తుచేసుకున్నారట. 

ఇకపై రాబోయే రోజుల్లో కృష్ణగారు మానసికంగా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు అన్నారట. ఇక తండ్రి వెంట వచ్చిన నారా లోకేష్ కూడా విజయ నిర్మలగారి గొప్పతనం గురించి గుర్తుచేసుకుంటూ కృష్ణ గారితో కాసేపు ముచ్చటించారట. అయితే ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబును చంద్రబాబు, లోకేష్ లు కలిసి కాసేపు మాట్లాడినట్లు సమాచారం. ఇక సీనియర్ నటుడు నరేష్, ఎంపీ గల్లా జయదేవ్ కూడా వారిద్దరితో కాసేపు సంభాషించినట్లు తెలుస్తోంది...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: