జైరా వాసిం... రెండు పదుల వయసు కూడా నిండని అమ్మాయి. కశ్మీర్‌లో పుట్టి పెరిగిన ఆమె 13 ఏళ్లకే తనకు పరిచయం లేని బాలీవుడ్‌లో అడుగు పెట్టడమే ఆశ్చర్యం అనుకుంటే, తొలి చిత్రం ‘దంగల్‌’తోనే ఆమీర్‌ ఖాన్‌ లాంటి అగ్రకథానాయకుడితో కలసి నటించడం, ఆ చిత్రంతో ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం అందుకోవడం విశేషమనే చెప్పాలి. జైరా ప్రతిభ చూసి ఆమీర్‌ ఖాన్‌ ఆమెతో ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ నిర్మించడమే కాదు, అందులో తను సహాయ పాత్రలో నటించారు.

 

ఇక ఆమె తన మూడో చిత్రం ‘ది స్కై ఈజ్‌  పింక్‌’లో అగ్రనాయిక ప్రియాంక చోప్రాతో నటించే అవకాశాన్ని అందుకుందంటే ఆమె ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే తన మూడో చిత్రం ఇంకా విడుదల కానే లేదు.. ఇంతలోనే తాను సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించబోతున్నట్లు ప్రకటించి చిత్రసీమను, అభిమానులను షాక్‌కు గురిచేసింది 18 ఏళ్ల జైరా.

 

తాను కొనసాగుతున్న రంగం తన మత విశ్వాసాలకు అడ్డుతగులుతోందని, అందుకే సినిమాలకు దూరమవుతున్నానని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిందామె. ఓ సుదీర్ఘమైన పోస్టులో తన ఆవేదనను వ్యక్తపరిచింది. ‘‘బాలీవుడ్‌ నాకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. విజయానికి సూచికలా, యువతకు మార్గదర్శిలా నన్ను పరిగణించడం మొదలుపెట్టారు. అయితే వీటిని కోరుకుని నేను ఈ రంగంలోకి రాలేదు. విజయాలకు, వైఫల్యాలకు సంబంధించి నా ఆలోచనలు వేరు.

 

సినీ పరిశ్రమలో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నేను ఓ విషయం పంచుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న పనితో సంతోషంగా లేను. నేను ఇంకెవరిలానో అవడానికి ఇక్కడ కష్టపడుతున్నానేమో అనిపిస్తోంది. నేను ఇందులో పడిన తపన, కేటాయించిన సమయం, ఎదుర్కొన్న భావోద్వేగాలు, మార్చుకున్న జీవన విధానం లాంటి విషయాలను బేరీజు వేసుకుంటే ఈ రంగానికి నేను సరిపోతాను కానీ, ఇక్కడ ఉండాల్సిన వ్యక్తిని కాదనిపిస్తోంది. అని ఆమె ఈ నిర్ణయం తీసుకోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: