పాత్రకు తగ్గట్టుగా తనను తాను తయారు చేసుకుంటాని అని అన్నారు నటుడు విక్రమ్‌. సేతు చిత్రంతో నటుడిగా తానేంటో నిరూపించుకున్న ఈ వెర్సటైల్‌ నటుడు తాజా చిత్రం కడారం కొండాన్‌ వరకూ తన నట ప్రస్థానాన్ని దిగ్విజయంగా సాగిస్తూ స్టార్‌గా నాటౌట్‌గా నిలిచారు. ఒక పక్క వారసుడు దృవ్‌ హీరోగా పరిచయం అవుతున్నా, తన మార్కెట్‌ను మాత్రం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ, ఇంకా చెప్పాలంటే పెంచుకుంటూనే ఉన్నారు.

 

విక్రమ్‌ చిత్రం చేస్తున్నారంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే భావన ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ కలుగుతుంది.  పాత్రకు జీవం పోయడానికి ఎంతదాకా అయినా వెళ్లే అతి కొద్ది మంది నటుల్లో విక్రమ్‌ ఒకరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. సేతు, అన్నియన్‌ (తెలుగులో అపరిచితుడు), ఐ లాంటి చిత్రాలే అందుకు చిన్న ఉదాహరణ.

 

తాజాగా కడారం కొండాన్‌ చిత్రం కోసం అదే కృషి, అదే శ్రమ. అబ్బా ఏం మనిషండీ ఈయన పాత్ర కోసం ఇంతగా తపిస్తారా అని విస్మయం చెందేంతగా ఎఫర్ట్‌ పెడతారు. విశ్వనటుడు కమలహాసనే తాను పోషించాల్సిన పాత్రను విక్రమ్‌తో చేయించారంటే నటుడిగా ఈయనకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్‌ ఉండదేమో.అవును తాను పోíషించాల్సిన కడారం కొండాన్‌ చిత్రంలో విక్రమ్‌ను నటింపజేసి, నిర్మాత బాధ్యతను తీసుకుని కమలహాసన్‌ ఆనందించారు.

 

కమలహాసన్‌ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, ట్రైడెంట్స్‌ ఆర్ట్స్‌ రవీంద్రన్‌ కలిసి నిర్మించిన కడారం కొండాన్‌ చిత్రంలో విక్రమ్, అక్షరహాసన్, అభిసరవణన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం  విక్రమ్‌ ఫిట్‌నెస్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గుండెలపై సగభాగం టాటూలతో నింపి, పెప్పర్‌స్టాల్ట్‌ గెటప్‌ చాలా కొత్తగా కనిపిస్తారు. రాజేశ్‌.ఎం.సెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 19వ తేదీన తెరపైకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: