జగడం సినిమా తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి మాస్ హీరోగా రామ్ నటించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. మాస్ కూడా కాదు అంతకు మించి. అసలు రామ్ లో ఇలాంటి యాంగిల్ ఒకటుందా అని ఈ సినిమా ట్రైలర్ చూసేవరకూ ప్రేక్షకులకేకాదు రామ్ కి కూడా తెలీదు. ఈ సినిమా ఓపెనింగ్ నుండే బాగా హైప్ క్రియోట్ అయింది. అందుకు తగ్గట్టుగానే అందరి అంచనాలకు తగ్గట్టే ఇస్మార్ట్ శంకర్ ఓపెనింగ్స్ తో ఆడేసుకున్నాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ తో మొదలుకుని క్రాస్ రోడ్స్ లో సుదర్శన్, సంధ్య థియేటర్స్ దాకా.. బెజవాడ సినీ పోలీస్ నుంచి కర్నూల్ శ్రీరామ టాకీసు దాకా అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భయంకరమైన వసూళ్లు తెచ్చాడు. కనీసం ఒక రోజు కూడా పూర్తి కాకుండానే వస్తున్న కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ సైతం షాక్ అవుతోంది. అందుకు ముఖ్య కారణం ప్రమోషన్ లో పక్కా మాస్ మూవీగా ప్రొజెక్ట్ చేయడమే ఇవాళ అతి పెద్ద ప్లస్ గా నిలిచింది.

రామ్ గత సినిమా హలో గురు ప్రేమ కోసమే, పూరి లాస్ట్ సినిమా మెహబూబాకు ఇందులో సగం కాదు పావు వంతు ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయని లేటెస్ట్ న్యూస్. కానీ ఇస్మార్ట్ శంకర్ కోసం కలిసిన రామ్-పూరి కాంబోకు మాత్రం బ్రహాండమైన కలెక్షన్స్ వస్తున్నాయంటే దానికి కారణం మాస్ ప్రేక్షకుల అండనే అని చెప్పాలి. ఇది హిట్టా ఫట్టా అని ఇవాళే చెప్పడం తొందరపాటుతనమే అవుతుంది. రెస్పాన్స్ పరంగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి పక్కాగా క్లారిటీ రావాలంటే ఈ వీకెండ్ దాటాలి. పైగా ఇస్మార్ట్ శంకర్ మొదటి రెండు రోజులు అడ్వాన్స్ బుకింగ్ మీదే నడుస్తోంది. ఆదివారం అయ్యాక సోమవారం నుంచి శంకర్ ఎలా రన్ అవుతాడు అనేదాని మీద హిట్టా ఫట్టా అని డిసైడ్ చేయొచ్చు. 

టాక్ తో సంబంధం లేకుండా ఇదే జోరు కొనసాగితే థియేట్రికల్ బిజినెస్ జరిగిన 18 కోట్లు ఈజీగానే వచ్చేస్తాయి. అలా కాకుండా మండే కలెక్షన్స్ లో డ్రాప్ ఎక్కువగా ఉందంటే లెక్క మారుతుంది. ఇది తేలడానికి ఓ ఐదు రోజులు గడవాల్సిందే. మాస్ బ్రాండ్ పుణ్యమా అని రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ తెచ్చేసుకున్నాడు. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ పూరీ టీమ్ కి సక్సస్ ని ఇచ్చేలానే కనిపిస్తోంది. కొంతమందైతే ఈ సినిమాతో పూరీ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: