ఇటీవల సంచలనం సృష్టించిన 'ఆమె' హీరోయిన్‌ అమలాపాల్‌ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను ఒక ప్రముఖ జాతీయ పత్రికతో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలివి..

'' మార్పు కావాలి, ఈ ప్రపంచానికి దూరంగా కొన్నాళ్లు ఎటైనా వెళ్లిపోవాలి, అది 2016. హిమాలయాల ట్రిప్‌ వెళ్లాను. ఫ్యాన్సీ డ్రెస్సులు, లోషన్లు, లిప్‌ బామ్‌ ఎట్సెట్రా అన్నీ సర్దుకుని వెళ్లాను. నాలుగు రోజుల ట్రెక్కింగులో అన్నీ ఖాళీ అయిపోయాయి. నా మనసులాగే, మొబైల్‌ ఫోన్‌ లేదు, టెంట్లలో పడుకునేదాన్ని రోజుల తరబడీ నడక, నడక దేహం, మెదడు మొద్దుబారిపోయాయి నడుస్తూ నడుస్తూ, ఆ ఒంటరి నడకలో నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలెట్టాను. నన్ను కుదిపేసే ప్రశ్నలకు జవాబులు అన్వేషించుకునేదాన్ని.

నాలోకి నేను పయనిస్తూ, ఆత్మశోధన. నా జీవితం ఎక్కడ స్టార్టయ్యంది..? నా ప్రస్థానం ఎటువైపు..? అసలు ఎందుకీ బాధ..? ఆ హిమాలయాల్లో అనుభవించిన ఆ ఒంటరితనం నాలోని వాస్తవిక ఒంటరితనాన్ని క్రమేపీ దూరం చేసింది. నాలోని ఏదో అంతఃశక్తిని అది మేల్కొలిపినట్టు అనిపించేది. అవునూ, జీవితంలోని ప్రతి పరిణామానికీ ఓ కారణం ఉంటుంది కదా. జరగాల్సిందే జరుగుతున్నది. మరి జరిగిన దానికి చింత దేనికి..? కర్మను బట్టే ఫలితం కదా..... తిరిగి వచ్చాను. మళ్లీ ఈ మెటీరియలిస్టిక్‌ ప్రపంచానికి దూరంగా పుదుచ్చేరికి వెళ్లిపోయాను...

ఆరొవిల్లే అని ఓ విశ్వమానవ నగరం ఉంది అక్కడ పలు దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ఒకేచోట నివసిస్తూ ఉంటారు. అరుదైన ప్రపంచం. అక్కడ ఉండటానికి నెలకు 20 వేల దాకా ఖర్చయ్యేది. నా మెర్సిడెస్‌ కారు అమ్మేశాను. ఆ కారుతో పాటు నన్ను ఇన్నాళ్లూ ఆవహించి ఉన్న అహం కూడా నన్ను వీడి వెళ్లిపోయినట్టనిపించింది. నన్ను నేల మీదకు దింపేసింది. ఓ సైకిల్‌ తీసుకుని నాకు కావల్సిన సరుకుల కోసం తిరిగేదాన్ని.యోగా, గార్డెనింగు, రీడింగు, సర్ఫింగు... ఇదే నా జీవితం.

నిజానికి హిమాలయాల్లోనే ఉండిపోవాలని అనుకున్నా, కానీ కష్టం. అందుకే ఈ పుదుచ్చేరిని ఎంచుకున్నా. ఈ ఆరోవిల్లె నగరం విశేషం ఏమిటంటే..? పరిసరాలు నీటుగా ఉంటయ్‌. కుళ్లు కుతంత్రాలకు పెద్దగా చాన్స్‌ లేదు. సాయంత్రాలు చాలామందిమి ఒకచోట చేరి, భోజనాలు చేసేవాళ్లం. ఒకరి ఫుడ్‌ ఒకరు షేర్‌ చేసుకునేవాళ్లం. రిలాక్స్‌ గిటార్‌, సంగీతం... కాసింత ముల్తానీ మట్టి లేదా పెసరపిండి మాస్కు చేసుకునే దానిని అంతే.అసలు నన్ను గతంలో చూసినవారు కూడా వెంటనే నన్ను గుర్తుపట్టలేనంతగా మారిపోయాను...'' అన్నారు అమలాపాల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: