బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు తావిచ్చాయి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఖాందాని షఫాఖానా’ అనే చిత్రం ఆగస్టు 2న విడుదలకు సిద్ధమవుతోంది. శిల్పి దాస్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచారంలో భాగంగా మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో సినిమా గురించి సోనాక్షి సిన్హా మాట్లాడారు. ‘ఖాందాని షఫాఖానా’ సరదాగా సాగిపోయే సినిమా అని, ఇండియాలో సెక్స్‌పై ఉన్న అపోహలను సున్నితమైన పద్ధతిలో చెప్పిన చిత్రమని సోనాక్షి చెప్పారు. ఈ సందర్భంగా సెక్స్ ఎడ్యుకేషన్ ప్రస్తావనను సోనాక్షి తీసుకొచ్చారు. 


‘‘మనం ఆధునిక సమాజంలో ఉన్నామని ఎవరికివారు అనుకుంటారు. కానీ, సెక్స్ గురించి మాట్లాడటానికి మాత్రం సంకోచిస్తారు. మీరు ఉపదేశాలు ఇస్తే ప్రజలు పట్టించుకోరు. వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మేం అదే చేశాం. చాలా చక్కగా, సరదాగా, వినోదభరితమైన పద్ధతిలో చెప్పాం. ఈ సబ్జెక్టును డైరెక్టర్ చాలా సున్నితంగా తెరకెక్కించారు. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను సినిమాలో చర్చించాం. సెక్స్ ఎడ్యుకేషన్‌ను స్కూల్స్‌లో ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలి. సెక్స్ పాఠాల గురించి పిల్లలకు వివరించాలి. అలా చేస్తే దీన్ని పిల్లలు చెడుగా అర్థంచేసుకోవడం మానేస్తారు’’ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సోనాక్షి అన్నారు. 


సోనాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు తావిచ్చాయి. కొంత మంది ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతుంటే.. విద్యావేత్తలు మాత్రం సోనాక్షికి మద్దతు తెలుపుతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరమేనంటున్నారు. ఇంటర్నెట్ వ్యాప్తిచెంది ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్న ఈ రోజుల్లో యువత తప్పుదోవ పట్టకూడదంటే వాళ్లకు సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రస్తుతం సమాజంలో సెక్స్ అంటే బూతుగానే చూస్తున్నారు తప్ప.. దాని వల్ల జరుగుతున్న అనార్థాలను గ్రహించి పిల్లలకు దానిపై అవగాహన కల్పించలేకపోతున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: