అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం ‘గుణ 369’. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ అవుతోన్న సంద‌ర్భంగా ఈ చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి అర్జున్ జంధ్యాల వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం.
 
మీ గురించి...
 నా పూర్తి పేరు మల్లికార్జున్‌ జంధ్యాల. మా నాన్నగారు డాక్టర్‌ జంధ్యాల శాస్త్రి గారు. ఆయన జ్యోతిష శాస్త్రవేత్త. నేను సినిమాల్లోకి రాగలిగినా.. ఇప్పుడు ఒక సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చానన్నా.. అది కేవలం మా నాన్నగారి సపోర్ట్‌ వల్లే. నిజానికి నేను బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఇండస్ట్రీకి వచ్చేసాను. ఆ తర్వాత నా డిగ్రీ పూర్తి చేశాను. అయినా మా నాన్నగారు నన్నేప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
 
‘గుణ 369’ ఎలా మొద‌లైంది...
 ‘గుణ 369’ కథ రెగ్యులర్‌ కమర్షియల్‌ స్టోరీ కాదు, వాస్తవ కథను ఆధారం చేసుకొని రాసింది. మనమందరం తప్పులు చేస్తాం. అయితే ఆ తప్పు మనకు నష్టం కలిగించినా, మన పక్కవాళ్లకు మాత్రం నష్టం కలిగించకూడదనే థీమ్ తో ఈ సినిమా నడుస్తోంది.
 
మీ గురువు బోయపాటిగారు సినిమా చూశారా ...
కొన్ని రోజుల క్రితమే ఆయనకు ఈ సినిమా చూపించాను. సినిమా చూసి సింగిల్ డైలాగ్ లో బాగుందన్నారు. అయితే సినిమాలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పమని కోరితే.. ‘మార్పులు ఏమీ లేవు. కథ ఎలా చెప్పావో, సినిమా కూడా అలాగే తీశావని అన్నారు. మా నిర్మాతలు కూడా సేమ్ అలాగే అన్నారు. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది.
 
బోయపాటిగారితో మీకున్న అనుబంధం ...
 నేను సినిమా గురించి ఏమైనా నేర్చుకున్నానంటే అది బోయపాటిగారి వల్లే. ఆయన దగ్గరే నేను చాలా సంవత్సరాలు పని చేశాను. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘తులసి’ సినిమా నుంచి.. ‘వినయ విధేయ రామ’ ఫస్ట్‌ షెడ్యూల్‌ వరకూ దాదాపు పదమూడేళ్ల పాటు ఆయన దగ్గరే పని చేశాను. నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు.
కార్తికేయ‌ని హీరోగా ఎంచుకోవ‌డానికి కార‌ణం...
నేను కార్తికేయ హీరోగా వచ్చిన ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమా చూసి.. ఈ కథకు కార్తికేయ అయితేనే బాగుటుందని అనిపించింది. కార్తికేయను కలిసి స్టోరీ లైన్‌ చెబితే.. అయన వెంటనే నచ్చిందని.. ఫుల్‌ స్క్రిప్ట్‌ చెప్పమని కోరారు. ఫుల్ స్క్రిప్ట్‌ చెప్పాక ఆయనకు బాగా నచ్చింది. అలా ఈ సినిమా మొదలైంది.
 
మీరు రాసుకున్న పాత్రకు కార్తికేయ న్యాయం చేశారా ...
చాలా బాగా నటించాడు. తను ప్రతిభావంతమైన నటుడు. ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాలో కంటే కూడా కార్తికేయ ఈ సినిమాలో ఇంకా అద్భుతంగా నటించారు.ఇక మొబైల్‌ షాప్‌ నడిపే పాత్రలో హీరోయిన్‌ అనఘ కూడా చక్కగా నటించింది.
 
త‌ర్వాత చిత్రాలు...
 కథలు ఉన్నాయి, ఈ సినిమా కథకంటే ముందే.. చాలా కథలు రాశాను. కొంతమంది హీరోలకు కూడా చెప్పాను. ప్రస్తుతం ‘గుణ 369’ రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: