సినీ నటుడు, రచయిత దర్శకుడు పోసాని క్రిష్ణ మురళి వైసీపీలో చురుకైన నేత అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ జీవితం 2009 ప్రజారాజ్యం ఎమ్మెల్యే అభ్యర్ధిగా  ప్రారంభం అయినప్పటికీ ఆయన తరువాత కాలంలో జగన్ని బాగా ఇష్టపడ్డారు. నిజానికి టాలీవుడ్లో జగన్ పక్షం వహించి గట్టిగా గొంతెత్తిన వారిలో పోసాని, విజయచందర్ మొదటి వరసలో ఉంటారు. జగన్ కాంగ్రెస్ ని విభేధించి బయటకు వచ్చిన టైంలో వీరే ఆయనకు అండగా ఉన్నారు. ఇక జగన్ ప‌దేళ్ళ పోరాటంలో పోసాని పక్కన  ఉన్నారు.


ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చారు. తన పక్కన ఉన్న వారికి ఆయన పదవులు పంచుతున్నారు. మరి ఈ సమయంలో పోసానికి ఏ పదవి ఇస్తారన్న చర్చ కూడా వచ్చింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ తనకు పదవులు ఏవి ఇచ్చినా చేస్తానని, తాను స్వయంగా వెళ్ళి అడగనని తెగేసి చెప్పారు. తాను జగన్ కి సినిమా రంగం నుంచి తొలి మద్దతుదారుడునని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. జగన్ ఫలానా పదవి తీసుకో అని చెబితే తప్పకుండా అంటానని కూడా పోసాని చెప్పుకున్నారు.


ఇదిలా  ఉండగా ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు కొందరు పోసాని దగ్గరకు వచ్చి మద్దతుగా ప్రచారం చేయాలని కోరారని, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ కూడా ఇచ్చారని పోసాని ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశారు. ఓ విధంగా పోసాని ఆ మాట ఇపుడు గుర్తు చేయడం అంటే ఆయనకు రాజ్యసభ మీద మక్కువ ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వచ్చే ఏడాది రాజ్యసభ సీట్లు ఏపీలో ఖాళీ అవుతున్నాయి. 


మరి పోసానిని జగన్ గౌరవించాలంటే  ఓ సీటు ఇవ్వవచ్చు. లేదా ఇపుడు ఖాళీ  అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో ఒకదాన్ని ఇవ్వవచ్చు. లేదా నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వవచ్చు. అయితే పోసాని కోరిక ఇదీ అని బయటకు చెప్పకపోయినా గత హామీగా రాజ్యసభ ఆఫర్ ని గుర్తు చేసినందువల్ల జగన్ని ఆయన అదే కోరుతున్నారనుకోవాలి. మరి జగన్ పెద్దల సభకు పోసానిని పంపిస్తారా.. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: