అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు2 సినిమా ఈరోజు విడుదలైంది. నాగార్జున నటించిన మన్మథుడు సినిమా నాగ్ కెరీర్లో ఎంతపెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయితే మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. ఇదే పేరుతో నాగార్జున నటించిన ఈరోజు విడుదలైన మన్మథుడు2 సినిమాకు క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి యావరేజ్ రేటింగ్ తో రివ్యూలు, యావరేజ్ టాక్ వచ్చాయి. 
 
ఈ సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ బాగానే నటించినప్పటికీ కథ, కథనం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో సినిమా చాలా స్లోగా ఉంది. నాగార్జున నటించిన సినిమాల్లో సంగీతం ఎప్పుడూ అధ్భుతంగా ఉండేది. కానీ మన్మథుడు2 సినిమా మాత్రం సంగీతం పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత సరైన హిట్ లేని నాగార్జునకు ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా అంటే అనుమానమే. 
 
కానీ వరుసగా సెలవులు ఉండటం మాత్రం నాగార్జునకు కలిసొచ్చే అంశం. రేపు రెండవ శనివారం, ఆదివారం, బక్రీద్, స్వాతంత్ర్య దినోత్సవం ఇలా వరుస సెలవులు రావటంతో కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశం ఉంది. సాహో విడుదలయ్యేదాకా మరే పెద్ద సినిమా లేకపోవటం కూడా మన్మథుడు 2 సినిమాకు కలిసొస్తుంది. మరి ఈ అవకాశాల్ని మన్మథుడు 2 సినిమా ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. 
 
నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో తరువాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజు సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. కల్యాణ్ కృష్ణ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: