“మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. బాధ పడినప్పుడు ఓదార్చేవారు నలుగురు లేనప్పుడు మన జీవితం వేస్ట్..” అని ఓ సినిమాలో డైలాగ్. ఇందులో రెండూ రామ్ చరణ్ కు సూటవుతాయి. అవార్డ్ విన్నింగ్ పెర్పార్మెన్స్ ఇచ్చిన మగధీర, రంగస్థలం సినిమాలకు.. ప్రేక్షకులు చప్పట్లతో, అభిమానుల ఈలలతో, క్రిటిక్స్ అభినందనలతో చరణ్ ను తడిపేశారు. తన నటనకు గీటురాయిగా నిలవాల్సిన అవార్డులు దక్కకపోవడంతో అభినందించిన వారే చరణ్ ను ఓదార్చక తప్పడం లేదు.


 

ఇటివల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రంగస్థలంకు వచ్చిన అవార్డుల విషయంలో కమిటీపై అనుమానాలు వెల్లువెత్తాయి. రంగస్థలంలో చరణ్ చెవిటి పాత్రలో జీవించాడనే చెప్పాలి. ప్రేక్షకాభిమానులు, క్రిటిక్స్.. చరణ్ నటనను మెచ్చుకోవడానికి కొత్త పదాలు వెతుక్కున్నారు. కానీ.. ఉత్తమ నటుడి కేటగిరీలో గుర్తించినవారే లేకపోయారు. పదేళ్ల క్రితం మగధీర విషయంలోనూ ఇదే జరిగింది. రెండో సినిమాతోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఉత్తమ నటుడుగా నంది అవార్డు రాలేదు. అప్పట్లో ఓ ఇండస్ట్రీ పెద్ద చేసిన కుటిలత్వానికి.. ఇప్పుడు ఓ పెద్ద నిర్మాత జాతీయస్థాయిలో చేసిన లాబీయింగ్ కు చరణ్ బలైపోయాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. దీనిపై హీరో మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "ఉత్తమ నటుడు అవార్డు ప్రకటనలో తప్పు లేదు. కానీ.. రంగస్థలంలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన చరణ్ కూడా జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి అర్హుడే. ఇటివల కాలంలో ఇంతటి అసాధారణ నటన మరే నటుడూ ఇవ్వలేదు. అవార్డు రాకపోయినా చరణ్ నటనకు ప్రేక్షకులు పట్టిన నీరాజనాలే ఎన్నో అవార్డులతో సమానం” అని ట్వీట్ చేశాడు.

 


మెగా ఫ్యామిలీపై ఉన్న అక్కసుతోనే కొందరు లాబీయింగులు చేసి అవార్డులు రాకుండా చేస్తున్నారన్న వాదనలు కొట్టిపారేసేవి కావు. సినిమాల్లో నటీనటుల ప్రతిభకు అవార్డులు వస్తే ఆ ఉత్సాహంతో మరిన్న ప్రయోగాత్మక సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. కుటిల రాజకీయాలు, లాబీయింగులతో ఒకరి ప్రతిభను అవార్డులతో అడ్డుకునేవారు ప్రేక్షకాభిమానుల అభిమానాన్ని మాత్రం అడ్డుకోలేరనేది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: