జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆర్టికల్ 370 రద్దు చేయటంతో పాకిస్తాన్ భారతదేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలన్నీ రద్దు చేసుకుంది. బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ లో ఎక్కడా ప్రదర్శించకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో సింగర్ మీకాసింగ్ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడైన పర్వేజ్ ముషారఫ్ కు దగ్గరి బంధువు ఇంట్లో సంగీత ప్రదర్శన ఇచ్చాడు. 
 
భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగా లేని సమయంలో మీకా సింగ్ పాకిస్తాన్ లో సంగీత ప్రదర్శన ఇవ్వటంపై భారత్, పాకిస్తాన్ లోని నెటిజన్లు విమర్శలు చేసారు. మీకా సింగ్ పాకిస్తాన్ లోని కరాచీలో సంగీత ప్రదర్శన ఇవ్వటంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మీకా సింగ్ పై నిషేధం విధించింది. భారత దేశంలోని ప్రొడక్షన్ హౌజ్ లు, ఆన్ లైన్ మ్యూజిక్ కంటెంట్ ప్రొవైడర్లు, మ్యూజిక్ కంపెనీలు మీకా సింగ్ తో కలిసి పని చేయడాన్ని నిషేధించింది. 
 
ఎవరైనా ఈ ఆదేశాల్ని లెక్క చేయకుండా మీకా సింగ్ తో కలిసి పని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేని సమయంలో మీకా సింగ్ చేసిన పని దేశం యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా ఉందని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ లాల్ గుప్తా ప్రకటన విడుదల చేసారు. మీకా సింగ్ బాలీవుడ్, బెంగాళీ, కన్నడ, తెలుగు భాషల్లో పాటలు పాడారు. 
 
రవితేజ నటించిన బలుపు సినిమాలోని పాతికేళ్ళ చిన్నది, ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని యాహూ యాహూ పాటను మీకా సింగ్ పాడారు. సింగ్ ఈజ్ కింగ్, జబ్ వి మెట్, హౌస్ ఫుల్ సినిమాలు మీకా సింగ్ కు సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మీకా సింగ్ సొంతంగా చాలా ఆల్బమ్స్ రిలీజ్ చేసాడు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: