అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 18 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు2 నాలుగు రోజుల్లో 9 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాలి. 
 
కానీ ప్రస్తుతం థియేటర్లలో మన్మథుడు2 పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. రేపు ఎవరు, రణరంగం సినిమాలు విడుదలవుతుండటంతో మన్మథుడు2 కలెక్షన్లు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత సరైన హిట్ లేని నాగార్జున కెరీర్లో మరో ఫ్లాప్ చేరినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న నాగార్జున నవంబర్ నెల నుండి కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడని సమాచారం. 
 
నాగార్జున మన్మథుడు2 ఫ్లాప్ అయినప్పటికీ బుల్లి తెర మీద మాత్రం నాగార్జున హిట్ అయ్యాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సీజన్ 1, సీజన్ 2 కంటే ఎక్కువగా బిగ్ బాస్ సీజన్ 3 లాంఛింగ్ ఎపిసోడ్ 17.90 రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్ అందుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 ను దాదాపు 4.5 కోట్ల మంది తెలుగు ప్రేక్షకులు వీక్షిస్తున్నారని సమాచారం. 
 
బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీయార్ బ్లాక్ బస్టర్ చేయగా సీజన్ 2 మాత్రం అనుకున్నంత హిట్ కాలేదు. కానీ నాగార్జున తొలి రోజు నుండే సీజన్ 3 పై భారీగా అంచనాలు పెంచాడు. షోలో టాస్కులు సరదాగా ఆడిస్తూనే బిగ్ బాస్ ఇంటి సభ్యులను తప్పు చేస్తే సున్నితంగా మందలిస్తున్నాడు నాగార్జున. అక్కినేని నాగార్జున కాకుండా మరెవరు హోస్ట్ చేసినా బిగ్ బాస్ సీజన్ 3 ఈ రేంజ్ హిట్ అయ్యేది కాదేమో అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: