అన్నాచెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ ప్రేమ అనుబంధానికి చిహ్నం రాఖీ. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి ‘రాఖీ’ కట్టి పదికాలాలపాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. వాస్తవానికి అసలు రాఖీ సంప్రదాయం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ ఆచారం అనాదిగా ఉందని తెలిపే ఆధారాలు ఉన్నాయి. 

రాఖీ పౌర్ణమిని ‘బలేవా’ అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు. దీనివెనుక ఒక కథ ఉంది. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తనవద్దే ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. దీనితో వైకుంఠం వెలవెల పోయింది. ఈ పరిస్థితులలో లక్ష్మీదేవి ఆలోచించి రాఖీ బంధన్ రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అని చెపుతారు. దీనితో బలిచక్రవర్తి లక్ష్మిదేవిని  ఏమికావాలి అని అడిగితే ఆమె తనకు విష్ణుమూర్తి కావాలి అని అడుగుతుంది. దీనితో బలిచక్రవర్తికి విషయం అర్ధం అయి శ్రీమహావిష్ణువును లక్ష్మిదేవికి అప్పగిస్తాడు.    

ఇలాంటి కథలు ఎన్నో రాఖీ పండుగకు సంబంధించి ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో రోజురోజుకి రక్షణ కోల్పోతున్న స్త్రీలకు అండగా ఒక సోదరుడు ఉన్నాడు అనే భావన ఈ రాఖీ బంధంలో ఉంది. ఈ బంధం ప్రపంచంలో మరి ఏ శక్తి ఇవ్వలేనంత బలాన్ని ఇస్తుంది అన్న నమ్మకంతో స్త్రీలు తమ సోదరులకే కాకుండా సోదర సమానంగా ఉండే స్నేహితులకు కూడ రాఖీని కట్టి తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.

ప్రస్తుత కాలంలో కేవలం స్త్రీలు తమ సోదర సమానులైన వ్యక్తులకు రాఖీ కడుతున్నా పురాతన కాలంలో ఒక భార్య భర్తకు – నాయనమ్మ మనవడికి రక్షాబంధన్ కట్టిన సందర్భాలు కనిపిస్తాయి. ఈరోజు రాఖీని కట్టించుకున్న వారు తమకు రాఖీ కట్టిన వారి కోరికలను అడిగి తెలుసుకుని వారి కోరికలను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక మనిషి తన క్షేమం గురించి ఆలోచించకుండా ఎదుటి మనిషి క్షేమాన్ని ముఖ్యంగా స్త్రీల క్షేమాన్ని ఆకాంక్షించే నిస్వార్ధమైన ప్రేమ అనురాగం ఈ రాఖీ బంధంలో ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: