బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఎట్టకేలకూ మళ్లీ ఛానెళ్ల తరువాత మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఇదే ఫామ్ చిరంజీవి పోటీగా మారింది. హృతిక్, మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ 'వార్'. దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు ఈ చిత్రాన్ని. మొత్తానికి ఈ చిత్రం ట్రైలర్ బాలీవుడ్ లోనే ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది. అదే రోజు చిరంజీవి సైరా విడుదల ఉండటం గమనార్హం. టాలెంటెడ్ అండ్ షార్ప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. పైగా సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో అక్టోబర్ 2న పూర్తిగా చిరంజీవికే వదిలేశారు తెలుగు స్టార్ హీరోలందరూ. కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మాత్రం అక్టోబర్ 2న తమ సినిమాని మెగాస్టార్ కి పోటీగా విడుదల చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్' హిందీతో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2నే రానుంది. కానీ 'సైరా' దెబ్బకి ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతుందని మొదట అనుకున్నప్పటికీ.. వార్ సినిమాని అనుకున్న డేట్ కే.. మెగాస్టార్ కి పోటీగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
మరి వీరు మెగా స్టార్ కి పోటీని ఇవ్వగలరా.. సైరాలో అమితాబ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో సైరా పై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సైరా టీమ్ హిందీలో కూడా భారీ ఎత్తున గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు మరియు హిందీ ప్రేక్షకులే కాకుండా.. కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వార్', 'సైరా'కి ఏ రేంజ్ పోటీ ఇస్తోందో చూడాలి. అయితే వార్ పై ఇప్పటికే బాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. పైగా హృతిక్ రోషన్ నుండి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవ్వడం కూడా వార్ కి మంచి అవకాశం. మొత్తానికి చిరుకి హృతిక్ రోషన్ గట్టి పోటీగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.