ఆమె ఓ పల్లెటూరుకు చెందిన సాధారణ గృహిణి.. పేరు బేబీ. ఊరు తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే కుటుంబం. అక్షరమైనా చదవలేని నిరక్షరాశి. టీవీల్లో, రేడియోల్లో వచ్చిన పాటలను గుర్తుపెట్టుకుని యథాతథంగా పాడటం ఆమె మనసుకు నచ్చే ప్రక్రియ.


పనితో పాటే పాటనూ ప్రేమించింది. నలుగురికి తన గానామృతం పంచుతూ వచ్చింది. గంజి కోసం పక్క ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఆమె పాటను ప్రేమించే ఓ అమ్మాయి.. బేబీ పాటను ఆమెకు తెలియకుండానే రికార్డు చేసింది. ఓ చెలియా నా ప్రియసఖియా..అంటూ బేబీ ఆలపించిన ఆ పాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.


వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టి.. ఫేస్‌ బుక్‌కు ఎక్కిన ఆమె పాట ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పుడామె ఓ ప్రముఖ గాయనిగా మారింది. సంగీత దర్శకులు రఘు కుంచె, కోటి వంటి వారు ఆమెకు సినిమా పాటల అవకాశాలు ఇచ్చారు. రఘు కుంచే సంగీతం అందిస్తోన్న పలాస చిత్రంలో ఆమె బాల సుబ్మహ్మణ్యం పక్కన ఓ పాట పాడారు. ఆ పాటను తాజాగా విడుదల చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ఈ పాటను పాడటం విశేషం.


బాలు ఓ ముప్ఫైయేళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడాలనుకోవడం ఎవరికైనా ఓ కల. ఆ కలను గాయనిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే అందుకున్న పల్లెకోయిల బేబీ ఏకంగా ఆయనతో కలిసి డ్యూయొట్ ఆలపించేయడం నిజంగా విశేషమే. అంత పెద్ద లెజెండ్ తో పాడుతున్నా.. ఎక్కడా తొణక్కుండా తన సహజమైన గాత్రంతో ఆకట్టుకుంది. లక్ష్మీ భూపాల ఈ పాటను రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: