యువి క్రియేషన్స్ దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో సాహో సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అవసరమా ? అనే ప్రశ్నకు సమాధానంగా కాదనే చెప్పాలి. సాహో నిర్మాతలు, దర్శకుడు చేసిన పొరపాట్ల వలన సాహో సినిమాకు ఇంత భారీ బడ్జెట్ అయింది. సాహో సినిమాను లిమిటెడ్ బడ్జెట్లో నిర్మాతలు తీసి ఉంటే మాత్రం సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ నిర్మాతలకు నష్టాలు మాత్రం భారీగా ఉండేవి కావు. 
 
నిజానికి సాహో సినిమాలోని చాలా సన్నివేశాల్ని రియల్ లొకేషన్లలోనే షూటింగ్ చేయవచ్చు. కానీ సినిమాలోని చిన్న సన్నివేశాల్నికూడా సెట్స్ వేసి తీయటంతో నిర్మాతలకు బడ్జెట్ చాలా ఎక్కువైంది. దర్శకుడు సుజీత్ ఈ కథను నాలుగు సంవత్సరాల క్రితం ప్రభాస్ కు చెప్పాడు. ఈ సినిమాకు ముందుగా అనుకున్న బడ్జెట్ 60, 70 కోట్ల రుపాయలు మాత్రమే. కానీ బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ మార్కెట్ పరిధి ఇండియా అంతటా పెరిగింది. 
 
కానీ బాహుబలి, బాహుబలి 2 సినిమాలు హిట్ కావటానికి హీరో ప్రభాస్ తో పాటు రాజమౌళి, బాహుబలి సినిమా కథ, కథనం, పాటలు ఇలా ఎన్నో కారణాలున్నాయి. కేవలం ప్రభాస్ మాత్రమే బాహుబలి సిరీస్ సినిమాలు హిట్ కావటానికి కారణం కాదు. సాహో సినిమాలో బాలీవుడ్ కు చెందిన ఎంతోమంది నటులున్నారు. ఈ నటుల్లో కొంతమందికి సినిమాలో సరైన ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా లేవు. చిన్న చిన్న ఆర్టిస్టులు చేయాల్సిన పాత్రలకు బాలీవుడ్ నటుల్ని పెట్టి లక్షల్లో, కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వటం వలన సినిమా బడ్జెట్ ఎక్కువైందే తప్ప సినిమాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. 
 
సాహో సినిమాలోని పాటలకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసారు. నేపథ్య సంగీతం మాత్రం జిబ్రాన్ అందించాడు. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసినా సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయటం వలన నిర్మాతలకు మరో ఐదారు కోట్లు బడ్జెట్ ఎక్కువయి ఉంటుందేమో తప్ప సినిమాకు కలిగిన ప్రయోజనం మాత్రం శూన్యం. ఈ సినిమాలోని రెండు మూడు నిమిషాల యాక్షన్ సీన్ల కోసం 90 కోట్ల రుపాయలు ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఈ ఖర్చు సినిమాకు భారీతనం తెచ్చిందేమో కానీ సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఈ యాక్షన్ సీన్లపై పెట్టిన శ్రధ్ధ కథ, కథనాలపై పెట్టి ఉంటే మాత్రం సాహో ఫలితం ఇంత దారుణంగా ఉండేది కాదేమో. 



మరింత సమాచారం తెలుసుకోండి: