విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని, తెలుగు జాతి ఈ భూమి మీద మిగిలి ఉన్నంతకాలం ఎప్పటికీ మరిచిపోదు అనే చెప్పాలి. అద్భుతమైన నటుడిగా తెలుగు వాడి ఖ్యాతిని దేశ విదేశాలకు ఇనుమడింప చేసిన అన్న గారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అంతేకాక తెలుగు వారి కోసం టిడిపి పార్టీ పెట్టి అప్పట్లో తొలి సారి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ పీఠాన్ని అదిష్ట్టించిన అన్న గారు, ఆ తరువాత పలు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చెరువయి, వారి గుండెల్లో రాజకీయ నాయకుడిగా కూడా చెరగని ముద్ర వేశారు. అయితే అంతటి మహానుభావుడి జీవిత గాథగా ఇటీవల రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం మాత్రం చాలామంది ప్రేక్షకులకు రుచించలేదు. 

ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గారు ప్రధాన పాత్రలో నటించిన ఆ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడినప్పటికీ, ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం అవి పూర్తిగా విఫలం అయ్యాయి. అయితే ఆ రెండు సినిమాల విషయమై నిన్న మీడియాతో మాట్లాడారు నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇండూరి. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రారంభ సమయంలోనే ఎంతో హైప్ ఏర్పడడం జరిగిందని, అన్న గారి జీవిత విశేషాలు తెలుసుకోవాలని తెలుగు వారితో పాటు దేశవ్యాప్తంగా ఎందరో ఎదురుచూశారని అన్నారు. అయితే రిలీజ్ తరువాత సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం తమ యూనిట్ కు ఎంతో నిరాశ కలిగించిందని చెప్పారు. ఇక దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ గారి సహా యూనిట్ మొత్తం రెండు సినిమాల కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ ఫలితం లేకుండా పోయిందని,  అయితే అటువంటి మహానుభావుడి జీవిత చరిత్ర పై చిత్రం నిర్మించినందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అన్నారు. 

కానీ ఆ చిత్రాలు మా అంచనాలు అందుకోక పోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రేక్షకులు ఆశించిన ఏదో కీ పాయింట్ మేము మిస్సయ్యామని అనిపించిందన్నారు. మహాభారతం, గాంధీ మహాత్ముడి జీవిత జీవిత గాధలు వంటివి ఒక పార్ట్ లో చెప్పగలిగినప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర కూడా ఒక పార్ట్ లో చెప్పివుండాల్సింది. ఎన్టీఆర్ చిత్రం ఒక భాగంగా వచ్చినట్లైతే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేదేమో అని ఆయన అన్నారు. అయితే ఎన్టీఆర్ బయో పిక్ సినిమాలు తనకు ఒకరకంగా ఎంతో గొప్ప గుర్తుగా మిగిలిపోయినప్పటికీ, మరొక విధంగా ఒక ఖరీదైన గుణపాఠం నేర్పాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విష్ణు, రణ్వీర్ సింగ్ తో కపిల్ దేవ్ బయోపిక్ 83, అలానే కంగనా రనావత్ తో  అమ్మ జయలలిత బయోపిక్ లను నిర్మిస్తున్నారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే విష్ణు ఎన్టీఆర్ బయోపిక్ గురించిన ఈ విషయాలు తెల్పడం జరిగింది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: