ప్రపంచ మానవాళి మొత్తం పర్యావరణాన్ని కాపాడుకోవాలని పరితపిస్తోంది. కాంక్రీట్ జంగిల్ లా మారిపోతున్న భారత్ లో కూడా పరిసరాలు పచ్చదనంతో నిండాలని కోరుకుంటున్నారు. ప్రతిఒక్కరూ తమ వంతుగా ఒక మొక్కైనా నాటడానికి ముందుకొస్తున్నారు. దీనికి సినీ సెలిబ్రిటీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు సైతం ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ సమంత మొక్కలు నాటాలని ట్విట్టర్ లో ఇచ్చిన పిలుపుకు జగ్గీ వాసుదేవ్ రీట్వీట్ ఇచ్చి మెచ్చుకున్నారు.



ఈషా ఫౌండేషన్ ద్వారా 'కావేరి పిలుస్తోంది' పేరుతో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి జగ్గీ వాసుదేవ్ పూనుకున్నారు. నదీ పరిరక్షణ కోసం, అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు స్పందించిన సమంత తన వంతుగా లక్ష మొక్కలు నాటాలని నిర్ణయుంచుకుంది. ఇందుకు రూ.42 చెల్లిస్తే మీరూ ఓ మొక్క నాటినవారవుతారని ట్విట్టర్ లో వీడియో ద్వారా తెలిపింది. ఈ కార్యక్రమంలో అభిమానులందరూ పాల్గొనాలని కోరింది. ఈ పోస్ట్ చూసిన జగ్గీ వాసుదేవ్ 'డియర్ సమంత.. కావేరీ నదీ మాత కోసం నువ్వు ఇచ్చిన సందేశానికి ప్రభావితమైన ఎంతోమంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని తెలిసింది. కావేరీ రక్ష కోసం నువ్వనుకున్న దానికంటే ఎక్కువగా నీ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నా.. ఆశీర్వదిస్తున్నా. ఇప్పటి, రాబోయే తరాలకు మనందరం ఇచ్చే అత్యుత్తమ బహుమతి ఇది' అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా ''కావేరి పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొనడం నాకు గర్వాంగా ఉంది' అని సమంత రిప్లై ఇచ్చింది.



ఇటీవల అమెజాన్ అడవులు కార్చిచ్చుకు గురికావడం ఎంతోమంది పర్యావరణ ప్రేమికులని ఆవేదనకు గురి చేసింది. మనదేశంలో కూడా పర్యావరణాన్ని కాపాడాలని, మొక్కలు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పలు స్వచ్చంద సంస్థలు కూడా మొక్కలు నాటేందుకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: