తమిళ సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ జయలలిత ప్రస్థానం ప్రత్యేకం. సినిమాల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారో రాజకీయాల్లోనూ అంతే  సాధించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అభిమానులకు అమ్మగా ఆమె సాధించిన కీర్తి ఎనలేనిది. ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగానే ఆమె మరణించారు. అప్పటినుంచీ ఆమె జీవిత చరిత్రను సినిమాగా మలచాలని అనేకమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిదే వివాదాంశం అవుతోంది. ఈ బయోపిక్ లో ఏ విషయాలు తెరకెక్కిస్తారో అవి ఎటువంటి వివాదాలకు దారి తీస్తాయోనని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

 

 

 

తమిళ హిట్ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత బయోపిక్ ను 'క్వీన్' పేరుతో వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో జయలలిత పాత్రలో రమ్యకృష్ణను తీసుకున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. ఈ బయోపిక్ ను అపాలంటూ జయలలిత మేనల్లుడు దీపక్ డిమాండ్ చేస్తున్నాడు. వెబ్ సిరీస్ ను ఆపని పక్షంలో హై కోర్టులో కేసు వేస్తానని నిర్మాత, దర్శకులను హెచ్చరిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా ఇదే జయలలిత కాన్సెప్ట్ తోనే మరో సినిమా కూడా రూపొందుతోంది. ఇందులో కంగనా రనౌత్ నటించబోతోంది. మరి దీపక్ ఈ సినిమా కూడా ఆపాలని డిమాండ్ చేస్తాడేమో చూడాలి. ముఖ్యంగా జయలలిత - కరుణానిధి మధ్య ఉన్న రాజకీయ వైరంపై అనేక కధనాలున్నాయి. జయలలిత బయోపిక్ పూర్తయితే సంచలనాలు నమోదవడం ఖాయమే.

 

 

 

దివంగత ముఖ్యమంత్రిగా జయలలిత తమిళులకు ఆరాధ్యదైవం. సినిమాల నుంచి రాజకీయాల వరకూ అనేక ఎత్తుపల్లాలున్నాయి. దీంతో ఆమె జీవితగాధను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ వివాదం సమసిపోతుందా.. గౌతమ్ సినిమా షూటింగ్ కొనసాగిస్తాడా.. దీపక్ కోర్టు మెట్లెక్కుతాడా అనేది చూడాల్సిందే. ఈ విషయంపై అమ్మ అభిమానుల స్పందనేంటో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: