విద్యాబాలన్ అంటే బాలీవుడ్, టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు..అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. మున్నాభాయ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యం ఉన్న కథల్లో అద్భుతమైన పాత్రల్లో ఒదిగిపోయిన గొప్ప నటి. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ తో తెలుగు లోగిళ్లకు సుపరిచితమైన విద్యాబాలన్ బసవతారకంగా ఇప్పటికీ పదే పదే తెలుగువారి స్మరణలో నిలుస్తుంది. ఇటీవలే మిషన్ మంగళ్ అనే బాలీవుడ్ సినిమాలో సైంటిస్టుగా నటించి మరోసారి తనేంటో నిరూపించుకుంది. పూజలు- పునస్కారాలు.. సెంటిమెంట్ అంటూ ఉండే ఒక సాధారణ గృహిణిలో ఇలాంటి ప్రతిభ దాగి ఉంటుందా..! అనిపించే పాత్రలో అందరు మైమరచిపోయో నటనతో ఆకట్టుకుంది.

దాదాపు నాలుగు నెలల గ్యాప్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుకు బాలన్ కమిటైంది. రీసెంట్‌గా లండన్ లో మ్యాథమెటికల్ జీనియస్ శకుంతలాదేవి బయోపిక్ ప్రారంభమైంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో బాలన్ నటిస్తోంది. ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాబాలన్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ కొద్ది నెలల గ్యాప్ లో నా గురించి నేను తెలుసుకున్నా. మ్యాథ్స్ లో ఇంత గొప్ప మేధావి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. హ్యూమన్ కంప్యూటర్ అన్న పేరు శకుంతలకు ఎలా వచ్చిందో తెలుసుకున్నా. ఆ తర్వాత ఆ పాత్ర మీద అమితంగా ఆసక్తి పెరిగింది అని తెలిపింది. ఈ కథను ఇష్టపడడానికి కారణం పాత్ర స్వభావం. అయస్కాంతం లాంటి ఆకర్షణ కలిగి ఉన్న పాత్ర ఇది. తన జీవితం ఎంత ప్రభావవంతమైంది అన్నది ఆకర్షించింది అని బాలన్ తెలిపారు. 

శకుంతలా దేవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సింపుల్ బాబ్డ్ హెయిర్ స్టైల్.. ఎరుపు రంగు చీరలో శకుంతలా దేవిగా విద్యా మేకోవర్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు. మహిళా దర్శకురాలు అను మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిల్క్ స్మిత పాత్రలో నటించిన బాలన్ కు ది డర్టీ పిక్చర్ తర్వాత ఇది నాలుగో బయోపిక్. శకుంతలా దేవి- హ్యూమన్ కంప్యూటర్ బయోపిక్ లో నటించబోతుండడం తో ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: