వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' సినిమా మొదటి నుంచే వివాదాల సుడిగుండంలో చిక్కుకొని.... పడుతూ, లేస్తూ, పోరాడుతూ... రిలీజ్ వరకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ పై ఒక కులం వారు ముందు నుంచి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బోయ కులానికి చెందిన వారు వాల్మీకి తమ కులస్థుడు అని.... అతని పేరుని సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ గా పెట్టడం తాము సహించేది లేదని వారు ఇంతకుముందే తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.

అనంతపురంలో 'వాల్మీకి' చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు బోయ వర్గానికి చెందినవారు అక్కడ ఉన్న యూనిట్ పై దాడి జరిపిన సంగతి కూడా విధితమే. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు ఏమాత్రం ముందు చూపు లేకుండా... అదే టైటిల్ తో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిపి, టీజర్, పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి రేపు విడుదల అనగా ఈ రోజున లేనిపోని తలనొప్పిని తెచ్చుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధమైన వాల్మీకిని అనంతపురంలో మాత్రం విడుదల చేసేందుకు బోయ వర్గంవాళ్ళు అంగీకరించకపోగా శాంతి భద్రతల ద్రుష్ట్యా కలెక్టర్ కూడా వాల్మీకి నో -ఎంట్రీ బోర్డు పెట్టేసాడు.

ఈ దెబ్బతో నిర్మాతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాదాపు ఒక ప్రాంతం మొత్తం సినిమా రిలీజ్ కాకపోతే చిన్న దెబ్బ కాదు. దీంతో వారు వేరే గత్యంతరం లేక ఇంకొక మూడు గంటల్లో యూ.ఎస్ ప్రీమియర్స్ పడుతాయి అనగా సినిమా టైటిల్ ను వాల్మీకి నుండి వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు అయిన 'గద్దెలకొండ గణేష్' కు మార్చేశారు. ఇప్పుడు 'గద్దెలకొండ గణేష్' వాల్మీకి ఇచ్చిన హైప్ క్యారీ చేయగలడా... లేదా అన్నది రేపొద్దునకి తెలిసిపోతుంది. ఏదేమైనా నా సరిగ్గా విడుదలకు ముందు ఇలాంటివి జరిగితే అభిమానులు మరియు చిత్ర బృందం ఆత్మస్థైర్యం భారీగా దెబ్బ తింటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: