టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ హీరోగా, మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్  దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా వాల్మీకి. ఈ సినిమాకు కోర్ట్ ఉత్తర్వుల కారణంగా సినిమా పేరును గద్దలకొండ గణేష్ గా మార్పు చేస్తున్నట్లు సినిమా నిర్మాతలు నిన్న రాత్రి మీడియాకు తెలిపారు. ఇక నేడు అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి ఆట నుండి మంచి టాక్ ని సంపాదించి మెగా ఫ్యాన్స్ లో మంచి జోష్ ని నింపింది. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ సినిమాలనే చేస్తూ వచ్చిన వరుణ్ తేజ్, ఒక్కసారిగా ఈ సినిమాలో మంచి మాస్ లుక్ లో దర్శనమివ్వడం, 

అదీకాక గద్దలకొండ గణేష్ అనే పాత్రలో అదరగొట్టే విధంగా నటనను కనబరచడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వరుణ్ ను ఎంతో మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన మెగా ఫ్యాన్స్ లో కొందరు అయితే, ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లడం మాకు లోటుగా అనిపించేదని, అయితే ఈ సినిమా చూసిన తరువాత వరుణ్ రూపంలో మాకు ఆ లోటు పూర్తిగా భర్తీ అయిపోయిందని అంటున్నారు. అంతలా అదరగొట్టే పెర్ఫార్మన్స్ చేసిన వరుణ్ పై కొందరు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్, సినిమాను ఎక్కడగా కూడా ఆడియన్స్ కు బోరింగ్ గా లేకుండా తెరకెక్కించిన విధానం సూపర్బ్ అని, అయితే సెకండ్ హాఫ్ లో కొంత వరకు సీన్స్ నెమ్మదిగా సాగినప్పటికీ, 

ఓవర్ ఆల్ గా సినిమా సక్సెస్ ముందు అది పెద్ద విషయమేమి కాదని అంటున్నారు. ఇక వరుణ్ సరసన హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే కు సినిమాలో మంచి స్కోప్ ఉందని, తన పాత్ర కాస్త చిన్నదే అయినప్పటికీ, ఆమె తన సహజ నటనతో అందరిని ఎంతో ఆకట్టుకుందట. ఇక తమిళ నటుడు అథర్వ మురళి, అలానే మరొక హీరోయిన్ మృణాళిని రవిలు కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారట. మంచి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను వరుణ్ తన డైలాగ్స్, యాక్షన్, పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటే, బ్రహ్మాజీ మరియు సత్య వంటివారు మంచి కామెడీ పంచెస్ తో ఇరగదీశారట. అలానే మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్ అని అంటున్నారు. మొత్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్, ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి హిట్ దిశగా దూసుకెళ్తున్నాడు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: