2008 సంవత్సరంలో అష్టా చమ్మా సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు నాని. అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ సినిమాలు హిట్ కావటంతో నానికి వరుసగా అవకాశాలొచ్చాయి. కానీ ఈగ తరువాత నాని నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 
 
కానీ మారుతి నాని కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ హిట్ కావటంతో నాని మార్కెట్ పెరిగింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఎ సినిమాలు హిట్ కావటంతో నాని మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగింది. నాని సినిమాలంటే మినిమం గ్యారంటీ సినిమా అని ప్రేక్షకులలోను, నిర్మాతలలోను అభిప్రాయం ఏర్పడింది. కానీ ఎంసీఎ సినిమా తరువాత నాని సినిమాలు ఎందుకో ఆశించినంత విజయాన్ని అందుకోవటం లేదు. 
 
ఎంసీఎ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటించిన కృష్ణార్జున యుధ్ధం సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కథ మేర్లపాక గాంధీ రామ్ చరణ్ కు చెప్పగా చరణ్ కు నచ్చకపోవటంతో ఇదే కథతో గాంధీ నానితో సినిమా తీశాడు. కృష్ణార్జున యుధ్ధం తరువాత నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. నాని నటించిన జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. 
 
గత శుక్రవారం విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా కలెక్షన్లు లేక బిలో యావరేజ్ గా మిగిలింది. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథను విక్రమ్ కె కుమార్ నానితో తీశాడు. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను నాని ఎంచుకొనే ముందు ఆ కథను హీరోలు రిజెక్ట్ చేయటానికి కారణాలు ఆలోచిస్తే మంచిది. నాని సినిమా సినిమాకు లుక్ విషయంలో కూడా మార్పులు చేస్తే మంచిది. కథల విషయంలో నాని జాగ్రత్త పడకపోతే మాత్రం నాని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: